నల్గొండ : నల్గొండ ( Nalgonda ) జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజ్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ( Road Accident ) ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్( SP Sharat Chandra Pawar ) శుక్రవారం పరిశీలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, ప్రమాదంలో చిక్కుకున్న వాహనాల స్థితిగతులు, రహదారి పరిస్థితులు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా ముప్పాల మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల థామస్య (51), ప్రకాష్ రావు (35), వరంగల్ ప్రాంతానికి చెందిన ఎస్ఎల్బీసీ (SLBC) సైట్ ఇంజినీర్ సాయికుమార్ (20) మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయాన్ని ఎస్పీ తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితులను పాటించడంతో పాటు ఓవర్టేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.