గ్రామీణ క్రీడాకారులకు చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎన్నో ఏండ్లుగా క్రీడలకు ప్రాధాన్యం దక్కలేదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఆటల వల్ల దేహదారుఢ్యం పెంపొందడంతోపాటు ఆరోగ్యంగా జీవించడం అలవడుతుందని చెప్పారు.
నల్లగొండ రూరల్, మే 22 : యువతలో క్రీడా స్ఫూర్తి నింపి , క్రీడల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. విద్యకు ప్రాధాన్యం కల్పించి సర్కారు బడులను బలోపేతం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులను దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తయారు చేస్తున్నదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని, ఎంతో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించిందని తెలిపారు. విద్యార్థులు ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలని, గెలుపును పునాదిగా వేసుకొని ఆయా రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులతో మేకల అభినవ్ అవుట్ డోర్ సందడిగా మారింది. ఆటల పోటీలతో యువతలో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, అదనపు కలెక్టర్లు ఖుష్బూగుప్తా, భాస్కర్‌రావు, జిల్లా యువజన, క్రీడల అధికారి మగ్బూల్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కర్తయ్య, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సీఎం కప్
బండ నరేందర్‌రెడ్డి, జడ్పీచైర్మన్,నల్లగొండ
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి వేదికల ద్వారానే క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో 5,140 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా 1,411 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు.
క్రీడలతో దేహ దారుఢ్యం, ఆత్మైస్థెర్యం పెంపు
కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఒత్తిడిలను తట్టుకునే శక్తిని ఇస్తాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. చిన్న చిన్న సమస్యలకే నేడు సమాజంలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రోజూ వ్యాయామం చేసి క్రీడల్లో పాల్గొనేవారు చరిత్రలో ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించేందుకు స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి మంచి పేరు తీసుకురావాలని కోరారు.