సూర్యాపేట టౌన్, నవంబర్ 24 : శారీరక శ్రమ లేకుండా బ్రెయిన్ పవర్‌తో ఆడే ఆట చదరంగమని, ఈ ఆటతో మేధాశక్తి పెంపొందుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓపెన్, అండర్ 11, 15 చదరంగ పోటీల్లో విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుంచి చదరంగం ఆట అంటే తనకు మక్కువని, ఈ ఆటకు బ్రెయిన్ పవర్‌తోపాటు ఎంతో ఓపిక ఉండాలన్నారు.
చెస్‌ను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలకంటే అసోసియేషన్లు, ఎన్జీఓలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. క్రికెట్ కంటే ఎక్కువగా ఒకప్పుడు ప్రపంచ చెస్ పోటీలు జరుగుతుంటే ప్రజలంతా చెస్ చాంపియన్‌షిప్ ఎవరికి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసేవారని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట జిల్లా నుంచి కూడా ఎంతో మంది చెస్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించారని తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రికెట్, సెల్‌ఫోన్ వైపు వెళ్లకుండా ప్రోత్సహించి పోటీలకు తీసుకురావడం అభినందనీయమని చెప్పారు.
ఈ పోటీల్లో మెడల్స్ పొందని వారు వచ్చే పోటీల్లో బాగా ఆడి రాణించాలన్నారు. అనంతరం ఆయన ఓపెన్ కేటగిరీ, అండర్ 11, అండర్ 15పోటీల్లో విజేతలైన బాల బాలికలకు షీల్డులతో పాటు నగదు ప్రోత్సాహకం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, గోపగాని వెంకటనారాయణగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, నెమ్మాది భిక్షం, మీలా వంశీ, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గండూరి కృపాకర్, ఎల్.సతీశ్‌కుమార్, జాయింట్ సెక్రటరీ లింగారెడ్డి, ట్రెజరర్ వెంకటమురళి, ఆర్పిటర్స్ కరుణాకర్, విశ్వప్రసాద్, జానయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.