సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 2 : లింగమంతుల స్వామి కొలువుదీరిన పెద్దగట్టు సూర్యాపేటకు తలమానికంగా నిలిచిందని, 2014 నుంచి అత్యధిక నిధులు తెచ్చి జాతర వైభవాన్ని మరింత పెంచామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా గురువారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గానికి చెందిన యాదవులకు సంప్రదాయ దుస్తులు, 150 భేరీలను అందజేసి మాట్లాడారు. సబ్బండ వర్గాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని నిలిపారని కొనియాడారు. ఇప్పటి వరకు రూ.15 కోట్లతో పెద్దగట్టులో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. గత పాలకులు, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పాలన కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. సందర్భం ఎప్పుడు వచ్చినా యాదవ సమాజం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్స్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీలు బీరవోలు రవీందర్ రెడ్డి, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవ్ నాయక్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.