అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మహిళల స్వయం ఉపాధికి ఊతమిచ్చేలా పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 49,143 స్వయం సహాయక సంఘాలకుగానూ రూ. 157.66 కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం రుణాలు అందజేయనున్నది. రెండు నెలల్లో మరో రూ.100 కోట్ల వడ్డీలేని రుణాలు రానున్నాయి.
– యాదాద్రి భువనగిరి, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
వడ్డీలేని రుణాలు ఇలా..
సూర్యాపేట
రుణాలు 41.5కోట్లు
సంఘాలు 13,065
యాదాద్రి జిల్లా
రుణాలు42.5 కోట్లు
సంఘాలు12,279
నల్లగొండ
రుణాలు 74.06 కోట్లు
సంఘాలు 23,799
యాదాద్రి భువనగిరి, మార్చి 7(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నది. సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేండ్లకు సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి రూ. 158 కోట్లు జిల్లాలకు చేరా యి. ఇందులో యాదాద్రి భువనగిరికి రూ. 42.5 కోట్లు, సూర్యాపేటకు 41.5 కోట్లు, నల్లగొండకు రూ. 74.06 కోట్లు ఉన్నాయి. ఇక 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మిగతా నిధులు మరో రెండు నెలల్లో విడుదల కానున్నాయి. ఇవి సగటున యాదాద్రి భువనగిరి, సూర్యాపేటకు రూ. 36కోట్ల చొప్పున, నల్లగొండకు రూ. 64కోట్ల వరకు ఉంటాయి.
49,143 స్వయం సహాయక సంఘాలకు రుణాలు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 49,143 స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించనున్నా రు. యాదాద్రి భువనగిరిలో 12,279 స్వయం సహాయక సంఘాలు, నల్లగొండలో 23,799, సూర్యాపేటలో 13,065 సంఘాలకు రుణాలు ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కొక్కరికీ సుమారుగా రూ. 75 వేల చొప్పున రుణం రానుంది. ఇక రుణం పొందే సమయంలో ఎలాంటి ఖర్చు లేదు. పేపర్, ప్రింటింగ్, డాక్యుమెంటేషన్ ఖర్చు లేకుండా రుణాన్ని అందిస్తున్నారు. నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే రుణాలు జమ కానున్నాయి.
స్వయం ఉపాధికి ఊతం..
సర్కారు వడ్డీలేని రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇస్తున్న రుణాలు వారి జీవనోపాధిని మెరుగుపర్చనున్నాయి. ప్రతి మహిళా స్వశక్తితో ఎదిగేలా ఊతమివ్వనున్నాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేందుకు దోహదపడనునాయి. ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలతో వివిధ రంగాల్లో చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా పరిపుష్టి పొందవచ్చు. కిరాణా షాపు, ఫ్యాన్సీ దుకాణాలు, టైలరింగ్, బ్యూటీపార్లర్, ప్లేట్ల తయారీ, జిరాక్స్ సెంటర్, జనరల్ మెడికల్ షాపు తదితర చిన్నచిన్న బిజినెస్లు నడపవచ్చు. వీటి ద్వారా నెలకు రూ. 10వేల నుంచి రూ. 20వేల దాకా ఆదాయం పొందుతూ ఆర్థికంగా మెరుగుపడాలనేది సర్కారు లక్ష్యం. అంతేకాకుండా మహిళలు పనిచేస్తూనే మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు లేకపోలేదు.
నేడు ఎమ్మెల్యేల చేతుల మీదుగా..
రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వారం పాటు వారోత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. బుధవారం మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వనున్నది. దాంతో అదే రోజు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రా ంగం ఏర్పాట్లు చేస్తున్నది. బుధవారం రోజే అందరికీ రుణాలు అందనున్నాయి.