కేంద్ర బడ్జెట్లో నిరాశే..
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్ట్‌లు, ఇనిస్టిట్యూషన్లపై ఆశలు పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి. పోచంపల్లికి ఐఐహెచ్‌టీ, మునుగోడు ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్, ఎంఎంటీఎస్, హైదరాబాద్-విజయవాడ హైస్పీడ్ రైలు, భువనగిరి ఖిలా అభివృద్ధి, సీసీఎంబీ, విద్యాసంస్థలు తదితర అనేక ప్రతిపాదనలు ఉన్నా ఆఖరికి గుండు సున్నానే మిగిలింది.
- ఉమ్మడి జిల్లాపై కరుణ చూపని నిర్మలమ్మ
- కొత్త ప్రాజెక్ట్ ఒక్కటీ రాలే.. నిధులూ విదిల్చలే..
- ఎప్పటిలాగే పోచంపల్లి ఐఐహెచ్‌టీకి మొండిచెయ్యి
- మునుగోడు ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌ను పట్టించుకోలే
- కేంద్ర విద్యా సంస్థల మంజూరు ఊసే లేదు
- ఉసూరుమన్న ఖిలా భువనగిరి, సీసీఎంబీ ప్రాజెక్ట్‌లు
- పరిగణలోకి తీసుకోని రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు
- హైదరాబాద్-విజయవాడ హైస్పీడ్ రైలూ అంతే..
- పెట్రో, గ్యాస్, నిత్యావసర ధరల భారంపై కలిగించని ఊరట
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్ట్‌లు, ఇనిస్టిట్యూషన్లపై ఆశలు పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి. పోచంపల్లికి ఐఐహెచ్‌టీ, మునుగోడు ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్, ఎంఎంటీఎస్, హైదరాబాద్-విజయవాడ హైస్పీడ్ రైలు, భువనగిరి ఖిలా అభివృద్ధి, సీసీఎంబీ, విద్యాసంస్థలు తదితర అనేక ప్రతిపాదనలు ఉన్నా ఆఖరికి గుండు సున్నానే మిగిలింది. మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పన్నులు మినహాయింపు లేదు, పెట్రో, గ్యాస్, నిత్యావసరాల ధరల భారంపైనా ఊరట లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోచంపల్లికి ఐఐహెచ్టీపై స్పష్టతేది..?
భూదాన్ పోచంపల్లి చేనేత చీరలకు పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏండ్ల నుంచి డిమాండ్ ఉంది. ఇదే విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ సైతం కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేశారు. ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. కానీ దీనిపై కేంద్రం బడ్జెట్లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏ మాయే..?
ప్రపంచంలో అత్యధికంగా ఫ్లోరైడ్ బాధితులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఉన్నారు. వందలు, వేల మంది ఫ్లోరైడ్‌తో కాలం వెల్లదీస్తున్నారు. గతంలోనే చౌటుప్పల్‌లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు తరలించుకుపోయింది. రీసెర్చ్ సెంటర్ వస్తే.. అధ్యయనాలు జరుగుతాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేస్తామని బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు హామీలు ఇచ్చారు. కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
ఖిలా భువనగిరికి నిధులేవి..?
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న భువనగిరి ఖిలాకు ఎప్పుడూ మొండి చెయ్యే ఎదురవుతున్నది. ఎన్నో బడ్జెట్లు వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ నిధులు మాత్రం విడుదల చేయడలేదు. స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.100 కోట్లు మంజూరు చేశారని చెబుతున్నా నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇటీవల ప్రధాని మోదీని వర్చువల్‌గా శంకుస్థాపన చేసినా.. నిధులు రాకపోవడంతో ఖిలా అభివృద్ధి ముందుకు సాగడం లేదు.
కొత్త సంస్థలూ ఇయ్యలే..
కేంద్ర బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి విద్యా సంస్థలు మంజూరు చేయలేదు. కొత్తగా ఏర్పాటైన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు జవహర్ నవోదయ పాఠశాలలు మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఏ జిల్లాకూ మంజూరు కాలేదు. భువనగిరిలోని బొమ్మాయిపల్లిలో 120 ఎకరాల్లో సీసీఎంబీ ఏర్పాటు చేస్తామని ఏడేండ్ల క్రితమే ప్రతిపాదలు పంపించినా ఉలుకూ పలుకూ లేదు. ఇక భువనగిరి ఇండస్ట్రియల్ పార్క్, దండు మల్కాపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను పరిగణలోకి తీసుకోలేదు. భువనగిరి- రాయగిరిలో ఎనిమిది లేన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ప్రతిపాదనలు ఉన్నా పట్టించుకోలేదు.
రైల్వే ప్రాజెక్టులపై నో క్లారిటీ..
గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగైదు సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్లోనే కలిపేసింది. దాంతో రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త గందరగోళం నెలకొంటున్నది. పింక్ బుక్ వస్తే తప్ప.. ఏం వచ్చాయో.. రాలేదో చెప్పలేని పరిస్థితి. బుధవారం లేదా గురువారం పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్- విజయవాడకు హైస్పీడ్ రైలు ప్రతిపాదలు ఎప్పటి నుంచో ఉన్నది. ఎంపీలు చెబుతున్న సమాచారం ప్రకారం దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు డిమాండ్‌ను పట్టించుకోలేదు. బీబీనగర్-నడికుడి డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు నిధులు కేటాంచాల్సి ఉంది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చకపోవడం, ఒక్క ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వకపోవడం దారుణం. కనీసం తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించక పోవడం బాధాకరం. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు చెందిన రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వకపోవడం బీజేపీ ప్రభుత్వానికి సవతితల్లి ప్రేమ అని తెలుస్తున్నది. తెలంగాణ విభజన చట్టంలోని రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించకపోవడం కేంద్ర ప్రభుత్వ చిన్నచూపునకు నిదర్శనం.
-నెల్లికంటి సత్యం, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి
మెరుపులు లేని సాధారణ బడ్జెట్
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంచలన విషయాలు ఏమీ లేవు. ఉన్నంతలో అందరినీ సంతృప్తి పర్చడానికి కృషి చేసినట్లు కనపడుతుంది. ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగస్తులు, వేతన జీవులకు ఎలాంటి భారం కలిగించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఉన్నది. ఇన్‌కమ్‌ట్యాక్స్ స్లాట్‌ని మూడు లక్షల ఆదాయం మించి ఉన్న వాళ్లు కూడా ఐదు శాతం చెల్లించాలన్నది నిరుత్సాహకరమైన అంశం. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంచడం కొంత నయం. పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడం, ఎంఎన్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అందించడం, ముద్ర రుణాలపై పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచడం, బంగారం, వెండి పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం, సెల్ఫోన్లు, కంప్యూటర్లపై సుంకం తగ్గించడం వల్ల వాటి ధరలు తగ్గుతాయి.
-పెద్దిరెడ్డి గణేశ్, బ్యాంకింగ్ రంగ నిపుణుడు, సూర్యాపేట
ఆర్థిక అసమానతలకు పరిష్కారమేది?
దేశంలో ఉన్న అసమానతలను పరిష్కరించే ప్రయత్నం బడ్జెట్లో చేయలేదు. గ్రామీణ ఉపాధి హామీ వంటి కీలక పథకాలు, ఆహార సబ్సిడీలను గణనీయంగా తగ్గిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాంధ్యం పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ట పర్చేందుకు బడ్జెట్లో తగిన చర్యలు రూపొందించలేదు. రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ జీడీపీలో ద్రవ్యలోటు 4.9 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. గ్రామీణుల ఆదాయం, కొనుగోలు శక్తి పెంపుపై దృష్టి సారించ లేదు.
– టి. నర్సింహమూర్తి, టీఎస్‌యూటీఎఫ్ నకిరేకల్ మండలాధ్యక్షుడు
ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల మార్పుతో తగ్గనున్న జీరో మనీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ స్లాబులను పెంచడం ద్వారా జీరో మనీని మరింత కట్టడి చేయొచ్చు. గతంలో రూ.10 లక్షల ఆదాయం దాటితే 30 శాతం ట్యాక్స్ ఉండగా కొత్త మార్పుతో రూ.15 లక్షల ఆదాయం పైన ఉంటేనే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75వేలకు పెంచడం ద్వారా ఉద్యోగస్తులకు ఊరట లభిస్తుంది. గతంలో షార్ట్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ స్లాబ్ ప్రకారం 20శాతం వరకు ట్యాక్సేషన్ ఉండగా ఇండక్సేషన్ ఎత్తివేయడం ద్వారా స్లాబ్‌తో సంబంధం లేకుండా 12.5 శాతం చేయడం అనేది మంచి నిర్ణయం.
– బ్రహ్మదేవర సోమయ్య, చార్టర్డ్ అకౌంటెంట్, సూర్యాపేట
ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనది. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు మేలు చేసేదేమీ లేదు. ఆహార ఉత్పత్తి ధరలు 3.8 నుంచి 7.5శాతానికి పెరిగాయి. ఆహార భద్రతకు ఈ బడ్జెట్లో 2వేల కోట్ల రూపాయలు తగ్గించింది. గ్రామీణ ప్రాంతంలో 70శాతం ఉన్న ఉపాధి కూలీలకు 86వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఉపాధి హామీకి రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత సంవత్సరం 54వేల కోట్ల రూపాయలు కేటాయించగా 32వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు.
-మట్టిపల్లి సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట
రైతాంగానికి మేలు చేయని బడ్జెట్
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం లేదు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఏడాది పాటు ఆందోళన చేసిన సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన రాత పూర్వక హామీల ప్రస్తావన ఈ బడ్జెట్లో లేక పోవడం దేశంలో ఉన్న రైతాంగాన్ని మోసం చేయడమే. వ్యవసాయ రంగానికి నిధులు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సిగ్గు చేటు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు కేటాయింపు సరిగా లేదు.
-మల్లు నాగార్జున్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి, సూర్యాపేట
మనకు నిరాశే మిగిలింది
రూ.48.21 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ రాష్ర్టాన్ని నిరాశపర్చింది. ఎన్డీఏ ప్రభుత్వ అనుకూల రాష్ర్టాలు ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశాకు వరాల జల్లు కురిపించారు. పది సంవత్సరాల నుంచి మధ్య తరగతి ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగా ట్యాక్స్ రిడక్షన్ రూ.5 లక్షలు నుంచి 7 లక్షలు పెంచకపోవడం నిరాశ. కేవలం స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి 70 వేలకు మాత్రమే పెంచారు. రాష్ర్టాలకు 50 సంవత్సరాల వడ్డీలేని రుణ సౌకర్యం కల్పించారు. కస్టమ్స్ డ్యూటీలు తగ్గించారు. అన్లైన్ వస్తువులు, కొనుగోలు ధరలు తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయ పరిశోధనా రంగానికి ప్రాధాన్యత, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, పంటలకు మద్దతు ధరలు ప్రకటించడం స్వాగతించదగ్గ అంశాలు.
-బడుగుల సైదులు, ఆర్థిక సామాజిక విశ్లేషకుడు, కోదాడ
మరికొన్ని ఇలా..
- ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్డు (త్రిఫుల్ ఆర్)కు నిధులు కేటాయించ లేదు.
- హైదరాబాద్-విజయవాడ త్రిబుల్ లైన్‌కు నిధులను ప్రతిపాదించ లేదు.
- భువనగిరి -రాయగిరి-ఆలేరు- జనగామ మధ్య నడిచే పుష్ఫుల్ రైలు ట్రిప్పులు పెంచాలనే వినతిని గాలికొదిలేశారు.
- రాయగిరి, భువనగిరి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, పలు రైళ్ల హాల్ట్‌ను పరిగణలోకి తీసుకోలేదు.
- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు నిధులు పత్తాలేవు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

