Congress | యాదగిరిగుట్ట, మే 2 :గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ పార్టీలో విబేధాలు భగ్గుమంటున్నాయి.మొన్న ఆలేరులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలోనే ఆ పార్టీజిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య వాగ్వాదానికి దిగగా,తాజాగా మంగళవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో బీర్ల, మరో నేత కల్లూరి రామంచంద్రారెడ్డి వర్గీయులు గొడవ పడ్డారు. మరోవైపు భట్టి పాదయాత్రకు జనం లేక కాంగ్రెస్ నేతలు డబ్బు, మద్యం పంపిణీ చేయడం గమనార్హం.
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. భట్టి పాదయాత్ర సాక్షిగా మాటల తూటాలతో విమర్శలు గుప్పించుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ.. నేనంటే నేనే అన్నట్టుగా వ్యవహరించారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు వచ్చిన పాదయాత్రలో భట్టి విక్రమార్క ఎదురుగానే కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య వర్గీయులు ఘర్షణ పడ్డారు. కల్లూరి ఫౌండేషన్ చైర్మన్ కల్లూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేటకు చెందిన మహ్మద్ హైదర్‌కు ఇల్లు నిర్మించారు. ఇల్లు ప్రారంభోత్సవానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవానికి వెళ్లొదని బీర్ల అయిలయ్య వర్గీయులైన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యులు గొడవకు దిగారు. ప్రారంభోత్సానికి వెళ్తే పార్టీకి రాజీనామా చేసి పెట్రోల్ పోసుకుని చనిపోతామని బెదిరింపుకు పాల్పడ్డారు. దాంతో భట్టి విక్రమార్క ప్రారంభోత్సవానికి వెళ్లకుండానే బీర్ల అయిలయ్యతో కలిసి పాదయాత్ర కొనసాగించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామచంద్రారెడ్డి ఇంటి యాజమానితోనే నూతన గృహాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో నాకు ఆదరణ లేదని, రాజీనామా చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
యథేచ్ఛగా డబ్బుల పంపిణీ..
భట్టిపాదయాత్ర సక్సెస్ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ పార్టీ పడ్డ తంటాలు ఇంతా అంతా కాదు. ఇప్పటికే రెండ్రోజులుగా జరిగిన పాదయాత్రలో ప్రజల ఆదరణ లేకపోవడంతోపాటు యాదగిరిగుట్టలో సైతం ఇదే దుస్థితి నెలకొన్నది. దాంతో బీర్ల వర్గీయులు డబ్బుల పంపిణీ చేపట్టారు. ఒక్కొక్కరికి 200 నుంచి 500 వరకు డబ్బులతోపాటు మందు బాటిళ్లు సరఫరా చేసినట్లు తెలిసింది.
పాదయాత్రకు కనిపించని ప్రజల ఆదరణ
ఒకవైపు వర్గపోరు, మరోవైపు ప్రజల నుంచి ఆదరణ లేకుండానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతున్నది. 100 మందికి మించి పాదయాత్రలో నాయకులు కనిపించడం లేదు. భట్టి ప్రసంగాన్ని పట్టించుకునేవారే లేరు. సుమారు 55 ఏండ్లపాటు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతానికి ఏం చేసిందని పలువురు గుసగుసలాడారు. అంతేకాకుండా ఆలేరు జడ్పీటీసీ కడుదుల నగేశ్, బీర్ల అయిలయ్య వేర్వేరుగా ఫ్లెక్సీలు వేసుకుని తమ మధ్యలో ఉన్న విభేదాలను బాహాటంగానే ప్రదర్శించారు.
జిల్లా అధ్యక్షుడిపైనే బీర్ల వాగ్వాదం
గత ఆదివారం ఆలేరులో భట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌తో ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభావేదికపై పలువురు నేతలు ప్రసంగిస్తుండగా వర్షం కురిసే అవకాశం ఉన్నందున ముఖ్య నేతలతోనే మాట్లాడించాలని బీర్లకు కుంభం అనిల్‌కుమార్ సూచించారు. దాంతో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం గురించి మీకు తెలియదు, నేను ఇక్కడ ఇన్చార్జినంటూ వాగ్వాదానికి దిగడంతో పార్టీ శ్రేణులు కంగుతిన్నారు.