రామగిరి, ఏప్రిల్ 27 : నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని సోమవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీతో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ప్రపంచ స్థాయి సమాచారం, పరిశోధనలు, గ్రంథాలు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ముందుకు సాగాలన్నారు. ఇక మీదట తాను సైతం నెలలో ఒకరోజు విద్యార్థులతో పాటు గ్రంథాలయంలో పఠనానికి విధిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, డా.కె. ప్రేమ్‌సాగర్, ఇంజనీర్ శైలజ, లైబ్రేరియన్ బుచ్చి రాములు పాల్గొన్నారు.
వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ ప్రయోగశాలలను వీసీ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యలో ప్రత్యక్ష అనుభవం, జ్ఞానం అందించే అధునాతన ప్రయోగశాలలు అందుబాటులో రావడం సంతోషకరమన్నారు. మొత్తం తొమ్మిది ప్రయోగశాలలను ఆయన ప్రారంభించారు.
1. ఇంజినీరింగ్ వర్క్‌షాప్ ల్యాబ్, 2. ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ ల్యాబ్, 3. ఎలక్ట్రికల్ డి.సి మోటార్స్ ల్యాబ్, 4. డి.సి జనరేటర్స్ ల్యాబ్, 5. ఏ.సి జనరేటర్స్ ల్యాబ్, 6. పవర్ సిస్టమ్స్ ల్యాబ్, 7. ఇంజినీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్, 8. ఇంజినీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్, 9. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ లను ఉప కులపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రేఖ, డా హరీష్ కుమార్, డా జయంతి, డా.సిహెచ్ సుధారాణి, ఆచార్య సాంబశివరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంజీయూలో డిజిటల్ లైబ్రరీ, ల్యాబ్స్ ప్రారంభం
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థినుల విద్యా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎమ్మెస్సీ జువాలజీ విభాగంలో టాపర్‌గా నిలిచిన విద్యార్థినికి ప్రదానం చేయనున్న “ వారణాసి భవాని” జ్ఞాపకార్థం స్వర్ణ పతకం కోసం రూ.3 లక్షల చెక్కును రిజిస్ట్రార్‌కు కుటుంబ సభ్యుడు బి.వీరభద్ర ప్రసాద్ అందజేశారు. విద్యార్థినుల కృషి, ప్రతిభ, ఉన్నత విద్యలో సాధిస్తున్న విజయాలను గౌరవిస్తూ ఈ స్వర్ణ పతకం ఏర్పాటు చేయడం విశేషమని పేర్కొన్నారు. రిటైర్డ్ హెచ్ఎం వారణాసి భవాని జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ స్వర్ణ పతకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థినులకు మరింత స్ఫూర్తి, ఉత్తేజం కలుగుతుందని, భవిష్యత్తులో వారు పరిశోధన, ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో అద్భుతంగా రాణించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని వీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఓఈ డా.జి. ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.