నల్లగొండ ప్రతినిధి, మార్చి17(నమస్తే తెలంగాణ)/నందికొండ : కృష్ణా పరీవాహక ప్రాంతంలో గత వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లిన విషయం తెలిసిందే. ఆల్మట్టి నుంచి మొదలుపెట్టి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువ వదలగా వందలాది టీఎంసీ నీరు సముద్రం పాలైంది. అంటే, ప్రాజెక్టుల్లో ఇప్పటికీ పుష్కలంగా నీరు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వేసవి ప్రారంభంలోనే కృష్ణానది ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు కనీస స్థాయికి చేరువవుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమ, కుడి కాల్వలతోపాటు ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోనూ మరో నెల రోజుల పాటు పంటలకు సాగునీటితో పాటు మళ్లీ వానకాలంలో వర్షాలు కురిసే వరకు తాగునీటి అవసరాలు తీరాల్సి ఉంది. ప్రభుత్వానికి నీటి విడుదల, భవిష్యత్ అవసరాలపై సరైన ప్రణాళిక లేకపోవడంతో మార్చి మధ్యలోనే నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరుతున్నదని నీటి పారుదల నిపుణులు చెప్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు ఆయకట్టుకు సాగునీటి అవసరం ఉండగా డెడ్ స్టోరేజీకి చేరుకున్నాక ఏం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు రోజురోజుకూ అడుగంటుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. రానున్న రోజుల్లో తాగు, సాగు నీటికి కష్టాలు తప్పేట్లు లేదని సాగునీటి రంగ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఈ ఏడాది వరద ఆశాజనకంగా రావడంతోపాటు ఎడతెరిపి లేకుండా మూడు నెలల పాటు క్రస్ట్ గేట్ల ద్వారా 627 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం పాలైంది. ఈ ఏడాది నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రెండు పంటలకు నీటికి ఢోకా ఉండదని అందరూ భావించినా, అందుకు భిన్నంగా అనూహ్యంగా సాగర్ చూస్తుండగానే డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నది.
నీటి నిర్వహణ సరిగ్గా లేక..
నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో ఈ ఏడాది నీరు పుష్కలంగా వచ్చి చేరినా సరైన నిర్వహణ లేకపోవడంతో కృష్ణా నీటిని ఇష్టానుసారంగా వాడుకున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఈ ఏడాది 1,203 టీఎంసీల నీరు వచ్చి చేరగా, కుడి కాల్వకు 185 టీఎంసీలు, ఎడమ కాల్వకు 114 టీఎంసీలు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 245 టీఎంసీ నీటిని విడుదల చేశారు. క్రస్ట్ గేట్ల ద్వారా మూడు నెలల పాటు 623 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. నీటి వినియోగంపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా నీటిని తరలిస్తున్నా పట్టించుకోలేదన్నది వాస్తవం. మళ్లీ వర్షాలు కురిసి వరదలు రావడానికి నాలుగు నెలల సమయం ఉండగా, ఇప్పటికే సాగర్‌లో నీరు లేకుండా పోతుండడం గమనార్హం.
డెడ్ స్టోరేజీకి పైన 15.7890 టీఎంసీల నీరు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 590 అడుగులు(312 టీఎంసీలు) కాగా, డెడ్ స్టోర్జీగా 510 ( 131.6690 టీఎంసీలుగా) అడుగులుగా నిర్ధారించారు. వానకాలంలో కురిసిన వర్షాలతో రెండు నెలలకు పైగా అంటే నవంబర్ చివరి వరకు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడింది. ఆ తర్వాత యాసంగి పంటలకు నీటి విడుదలతోపాటు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకుపోతుండడంతో వేగంగా నీటిమట్టం తగ్గిపోతూ వచ్చింది. దాంతో సరిగ్గా మూడు నెలల్లోనే సాగర్ డెడ్‌స్టోరేజీకి చేరువైంది. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 519 అడుగుల వద్ద 147.4580 టీఎంసీలుగా ఉంది. డెడ్ స్టోరేజ్‌కి పైన 9 అడుగులు (15.7890టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 7,033 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,454 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. రోజూ నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి తాగు, సాగుకు నీటి విడుదల కొనసాగుతున్నది. సగటున రెండు రోజులకు గానూ నాగార్జునసాగర్ నుంచి 2 టీఎంసీలు నీరు వినియోగిస్తుండడంతో రోజుకు 0.5 అడుగుల మేరు నీరు తగ్గుతున్నది. ఇదే రీతిన కొనసాగితే వారం, పది రోజుల్లోనే రిజర్వాయర్ నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది.
ప్రశ్నార్థకంగా సాగు, తాగు నీటి విడుదల
నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు గతేడాది జూలై నెలలో ఎగువ నుంచి వరద నీరు రాక మొదలైంది. దాంతో ఆగస్టు 2 నుంచి ఎడమ, కుడి కాల్వలకు సాగునీటి విడుదలను ప్రారంభించి మొదటి విడుతగా డిసెంబర్ 15 వరకు వానకాలం పంటలకు నీళ్లు ఇచ్చారు. డిసెంబర్ 15 నుంచి యాసంగి పంటలకు ఆన్ ఆండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలను ప్రారంభించారు. ఎడమ కాల్వ ద్వారా ప్రస్తుత సాగుకు వచ్చే నెల 23 వరకు పంటలకు సాగు నీరు ఇవ్వాల్సి ఉంది. రోజుకు ఎడమ కాల్వకు యావరేజీగా 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగిస్తే రబీ పంట కాలం పూర్తవడానికి మరో 36 రోజులకు గానూ 27 టీఎంసీ నీరు అవసరం అవుతుంది. దాంతోపాటు కుడి కాల్వకు సగటున 8వేల క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెకుల నీరు రోజూ కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీరు సాగు, తాగు అవసరాలకు ప్రశ్నార్థకమేనని నిపుణులు చెప్తున్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా పంటలకు, ఎస్ఎల్బీసీ తాగునీటి అవసరాలకు ఇవ్వాలంటే నాగార్జునసాగర్ డేడ్ స్టోర్జీ కంటే దిగువకు నీరును తోడుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఆ పరిస్థితే వస్తే సాగర్ ఆయకట్టులో సాగు, తాగుకు నీటి కష్టాలు తప్పవని సాగునీటి నిపుణులు, మాజీ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుడికాల్వకు యథేచ్ఛగా నీటి విడుదల
వానకాలం ప్రారంభం నుంచి కుడి కాల్వకు ప్రారంభమైన నీటి విడుదల యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. కుడి కాల్వపై ఏర్పాటు చేసిన టెలీమీటర్ (నీటి విడుదల లెక్కింపు యంత్రం) తుమ్మ చెట్ల పొదల్లో కమ్ముకుపోయి ఉంది. కుడి కాల్వకు అధికారులు చెప్పే లెక్కల కంటే అధికంగానే నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఇది సరిపోక ఎడమ కాల్వ ద్వారా కూడా తమ ప్రాంతానికి నీరు కావాలని కేఆర్ఎంబీకి ఆంధ్రా పాలకులు లేఖలు రాస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే..
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం నీటి నిల్వలపై రెండు రాష్ర్టాల అధికారులు చర్చించారు. సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నం. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉంది.
-మల్లికార్జున్, ఎన్నెస్పీ ఈఈ