సూర్యాపేట, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) ; రేషన్ బియ్యం అక్రమాల పాలవుతున్నది. ఇప్పటివరకు రేషన్ డీలర్ల నుంచి వినియోగదారులకు అందించే బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు రాగా ఇప్పుడు ఎఫ్సీఐ, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే అవకవతకలు జరుగున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు డీలర్లకు వచ్చే బియ్యం బస్తాలే నిదర్శనం. ఒక్కో బస్తా 50 కిలోలు ఉండాల్సి ఉండగా రెండు నాలుగు కిలోల వరకు తక్కువగా ఉంటున్నాయి. డీలర్లకు వచ్చే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద దోపిడీ చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో ప్రతి నెలా దాదాపు 59,463 క్వింటాళ్ల బియ్యం 1,18,926 డీలర్లకు చేరుతుండగా బస్తాకు 2 కిలోల చొప్పున తక్కువ వేసుకున్నా 2,378 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్లే. అంటే సుమారు రూ.55 లక్షలు దోచేస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారులు
పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టేజ్-2లోనే దోపిడీ..
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయనగానే దానికి కారకులు డీలర్లే అనడం పరిపాటిగా మారింది. కానీ అసలు దోపిడీ ఎక్కడ జరుగుతున్నది? లక్షలాది రూపాయల పాపపు సొమ్మును పంచేసుకునే వారు ఎవరు? అనే విషయాలు తెలిస్తే అవాక్కవడమే. సూర్యాపేట జిల్లాలో 3,04,353 ఫుడ్ సెక్యూరిటీ కార్డులతోపాటు 19,799 అంత్యోదయ, 36 అన్నపూర్ణ కార్డులు కలిపి మొత్తం 3,24,188 కార్డులు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రతినెలా సుమారు 59,463 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు అలాట్ చేస్తుంటారు. స్టేజ్-1 అంటే ఎఫ్సీఐ, స్టేజ్-2 అంటే జిల్లాలోని నాలుగు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా డీలర్లకు 50 కిలోల బస్తాలు చేరుతాయి. ఇక్కడ డీలర్లకు చేరే బియ్యంలో దోపిడీ జరుగుతున్నది. స్టేజ్-1 నుంచి స్టేజ్-2కు వే బ్రిడ్జి ద్వారా కాంటాలు వేస్తారు. కానీ స్టేజ్-2 నుంచి డీలర్లకు వచ్చే బియ్యాన్ని మాత్రం బస్తాలుగా పంపిస్తున్నారు.
బస్తాకు రెండు కిలోలు తక్కువ
డీలర్లకు వచ్చే 50కిలోల బస్తాలో 2 నుంచి రెండున్నర కిలోల వరకు బియ్యం తక్కువ వస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్లకు రావాల్సినవి నికరంగా బస్తాతో కలిపి 50.50 కిలోలు ఉండాల్సి ఉండగా 48 కిలోలు మాత్రమే ఉంటున్నాయి. కొన్ని బస్తాలు 45 నుంచి 47 కిలోలే ఉంటున్నాయి. ఇదేమని ప్రశ్నించే డీలర్లపై దాడులు చేసి కిలో నుంచి పది కిలోలు తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా 6ఏ కేసులు నమోదు చేస్తున్నందున కిమ్మనకుండా ఉంటున్నారు. అదే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వచ్చే బియ్యాన్ని మాత్రం ఎవరూ తనిఖీ చేయడం లేదని, దానికి లోలోపల అమ్యామ్యాలు అందిపుచ్చుకోవడమేనని కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రతి నెలా రూ.55లక్షల దోపిడీ..
జిల్లాలోని 3,24,188 కార్డులకు సుమారు 59,463 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిస్తున్నారు. ఒక్కో బియ్యం బస్తాలో రెండు కిలోలు తక్కువ ఉంటుండగా జిల్లాలోని నాలుగు ఎంఎల్ఎస్ పాయింట్లలో దాదాపు 2,378 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ ధర ప్రకారం క్వింటాకు రూ.2,300ల చొప్పున వాటి విలువ సుమారు రూ.54.60 లక్షలు. ఈ డబ్బులను అంతా కలిసి పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి కిలో నుంచి 10 కిలోల బియ్యం ఎక్కువ లేదా తక్కువ ఉన్నా డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసే అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్లకు వచ్చే బియ్యాన్ని ఎందుకు చెక్ చేయడం లేదని పలువురు డీలర్లు ధ్వజమెత్తుతున్నారు.