యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అత్యాధునిక యంత్రాలు, వసతులు సమకూర్చారు. ఐదు బెడ్స్‌ను సిద్ధం చేసిన అధికారులు, అక్కడే ఐదు డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ కూడా సిద్ధం చేశారు. ప్రతి రోజూ 30 మందికి డయాలసిస్ సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఐదుగురు సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటారు. వచ్చే వారంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డయాలసిస్ చేయించుకునే వారు ఆరోగ్య శ్రీ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఉచితంగా సేవలు పొందవచ్చు.
తీరనున్న తిప్పలు..
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వారానికి రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేసేందుకు ఒక్కసారికి రూ. 4 వేలకు పైగా ఖర్చు వస్తుంది. దాంతో పాటు సదరు చికిత్స కోసం రోగులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. దాంతో కిడ్నీ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం భువనగిరి ఏరియా దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండడంతో వారి ఇబ్బందులు తీరనున్నాయి. భువనగిరి పట్టణంలోనే ఉచితంగా డయాలసిస్ చేసుకునే సదుపాయం కలుగుతుండగా పేదలకు ఎంతో ఊరట కలుగనుంది.
ఎమ్మెల్యే పైళ్ల చొరవతో..
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చొరవతోనే భువనగిరి ఏరియా ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం లేక పోవడంతో కిడ్నీ వ్యాధి గ్రస్తులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ప్రభుత్వం కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. డయాలసిస్ సెంటర్లో ఏర్పాట్లు, సదుపాయాలను ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పలు దఫాలుగా పనులు పరిశీలించారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుపై అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆలేరు, చౌటుప్పల్‌లో..
కిడ్నీ బాధితుల ఇబ్బందులు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలో మొదటిసారి ఆలేరులో కేంద్రాన్ని 2020లో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 1200 చదరపు అడుగుల వైశాల్యంతో సకల సదుపాయాలతో ఏర్పాటు చేసింది. 10 డయాలసిస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. రోజుకు ముగ్గురికి చొప్పున మొత్తం.. 30మందికి దాకా చికిత్స అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించారు. ఇటీవల చౌటుప్పల్ ఆస్పత్రిలోనూ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇక్కడ ఐదు యంత్రాలను ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం..
భువనగిరి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక్కడ చికిత్స లేకపోవడంతో అనేక మంది నిత్యం నరకం చూసేవారు. హైదరాబాద్‌కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసేవారు. నా వద్దకు వచ్చి బాధితులు వారి ఇబ్బందులు చెప్పుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరే డయాలసిస్ కేంద్రం ఉండాలని ప్రభుత్వాన్ని కోరిన. కేంద్రం అందుబాటులోకి వస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కేంద్రం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
– పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి
వ్యాధిగ్రస్తులకు మేలు
డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. మన దగ్గర డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల రూపాయలు ఖర్చుపెట్టుకున్నారు. పేదలు అంతదూరం పోలేక ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కేంద్రంలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వస్తే రోగులకు మేలు కలుగుతుంది. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎన్నబోయిన ఆంజనేయులు, మున్సిపల్ చైర్పర్సన్, భువనగిరి