నల్లగొండ సిటీ, జూన్ 04 : నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఏల్లమ్మ ఆలయ 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 వరకు కొనసాగనున్నాయి. రేణుక ఎల్లమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే దేవత అని, భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యంతో పాటు అన్నదాన కార్యక్రమంను ఆలయ సిబ్బంది ముందుండి చేపడుతున్నారు.
ఈ నెల 5 నుంచి 7 వరకు జరగనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5న నిత్య పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంబించనున్నారు.
– 5వ తేదీ ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనం, ధ్వజరోహణం, దేవీ మూల మంత్ర హోమం, దుర్గా హోమం, బలిహరణ, గవ్యాంత పూజలు, వాస్తుపూజ, నిత్యహోమం, సాయంత్రం ఎదుర్కోలు
– 6వ తేదీ ఉదయం 10.30కు అమ్మవారి జమదగ్ని మహామునిల 23వ వార్షిక తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం అన్నదానం.
– 7వ తేదీన అమ్మవారికి 108 కలశములతో అష్టోతర శతఘటాభిషేక మహోత్సవం. సాయంత్రం ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల నుంచి బోనాలు, రాత్రి ఏకాంత సేవా, నీరాజన మంత్ర పుష్పం, తీర్ధప్రసాద గోష్టి.