ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో జిల్లాలోని పలు పీఏసీఎస్లవద్ద, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులుతీరుతున్నారు. గురువారం అర్వపల్లిలోని జనగాం- సూర్యాపేట హైవేపై యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళా రైతులు ధర్నాకు దిగారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామైంది. గురువారం టోకెన్ల కోసం పీఏసీఎస్ ఎదుట భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు. టోకెన్ల విషయంలో కొంతమంది మహిళా రైతుల మధ్య తోపులాట జరిగింది. అలాగే తిమ్మాపురం రైతు వేదిక వద్ద రైతులు బారులు తీరారు. తిరుమలగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద గురువారం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మఠంపల్లి మండలంలో యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారు.
ఒక రోజు పీఎసీఎస్ కార్యాలయం వద్ద, మరో రోజు మన గ్రోమోర్ సెంటర్ వద్ద అంటూ అటు ఇటూ తిప్పుతున్నారని, యూరియా ఎప్పుడొస్తదో తెలుస్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదాడ మండలంలోని గణపవరం, కాపుగల్లు పీఏసీఎస్ కార్యాలయాల వద్ద రైతులు ఒక్క యూరియా బస్తాకోసం పడిగాపులు కాస్తున్నారు. పెన్పహాడ్ మండలం నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని అనంతారం గ్రామ సొసైటీ వద్ద రోజుల తరబడి రైతులు జాగారం చేస్తున్నారు. గత శనివారం పాసు బుక్కులు, ఆధార్ కార్డులు సీరియల్ పెట్టిన వారికి మాత్రమే ఇస్తామని సొసైటీ సిబ్బంది చెప్పడంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నిడమనూరు పీఏసీఎస్ వద్దకు గత నాలుగు రోజులుగా వస్తున్నా యూరియా దొరక్కపోవడంతో విసుగు చెందిన రైతులు గురువారం మండలం కేంద్రంలోని కోదాడ జడ్చర్ల హైవేపై వర్షంలో సైతం గంటకు పైగా ధర్నా, రాస్తారోకో చేపట్టారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురుగొడుతుందని శాపనార్థాలు పెట్టారు. దేవరకొండ పరిసర ప్రాంత గ్రామాల రైతులు యూరియా లోడు వచ్చిందనే సమాచారం మేరకు దేవరకొండలోని వ్యవసాయ శాఖ, సహకార సంఘ కార్యాలయాల వద్దకు పెద్ద సంఖ్య వచ్చారు. ఆధార్, పాసుపుస్తకాలు వెంట తెచ్చుకొని గంటలపాటు పడిగాపులు కాశారు. తీరా.. యూరియా లోడ్ రావడం లేదనే విషయం తెలుసుకొని నిరాశగా వెనుదిరిగారు. ఈ విషయమై రైతులు వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా పది రోజుల్లో ఇస్తామని నచ్చజెప్పి పంపించివేశారు.