కోదాడ : అభివృద్ధి , సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ( Collector Tejas Nandlal ) ఆదేశించారు. శనివారం ఆర్ఎస్ వి ఫంక్షన్ హాలులో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ( Prajapalana ) లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు శానిటేషన్, త్రాగు నీరు, విద్యా, వైద్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.
ప్రభుత్వ ఆదేశాలతో వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు చేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్నాయా లేదా అని అధికారులు మానిటరింగ్ చేస్తూ అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని సూచించారు. కోదాడ ఏరియా హాస్పిటల్ అప్ గ్రేడ్ చేశామని వివరించారు. నియోజకవర్గంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫోటోతో కూడిన మెమొంటోలను అందజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, డీఎఫ్వో సతీష్, ఆర్డీవో సూర్యనారాయణ ఎస్సీ డీడీ దయానందరాణి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అడిషనల్ పీడీ సురేష్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు , సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.