యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 29 : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి కొండపైకి బస్సు వెళ్లేందుకు భక్తుల కోసం ప్రత్యేక దేవస్థాన బస్సు ప్రాంగణం నిర్మిస్తున్నారు. స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండకింద బస్టాండ్ పక్కనే దేవస్థానం ఆధ్వర్యంలో బస్సు దీనిని నిర్మిస్తుండగా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి.
మిగతావి పురోగతిలో ఉన్నాయి. వైటీడీఏ రూ. 8.79 కోట్లతో 2 ఎకరాల్లో నిర్మించే బస్టాండ్‌లో 10 ఫ్లాట్‌ఫామ్‌లు, 2 టికెట్ కౌంటర్, 2 ఏటీఎం సెంటర్లు, 5 షాపులు, క్లాక్ రూమ్, ఎగ్జిట్ లాబీ, కామన్ వెయిటింగ్ ఏరియా, స్త్రీలు, పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇన్చార్జి రూము నిర్మించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి స్వామివారి కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా నిర్మించే దేవస్థాన బస్సు ప్రాంగణం వద్దకు రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో నడిపే బస్సుల్లో కొండపైకి చేరుకుంటారు.