కొండామల్లేపల్లి, జనవరి 17 : దేవరకొండను తక్షణమే జిల్లాగా ప్రకటించాలని లంబాడీల ఐక్యవేదిక నల్లగొండ జిల్లా ఇన్చార్జి కొర్ర నాగరాజ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్పందిస్తూ.. గిరిజనుల ఆధిక్యతతో కూడిన దేవరకొండ ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక వెనుకబడి ఉందన్నారు. దేవరకొండ ప్రాంతంలో అధిక సంఖ్యలో గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరిలో ఎక్కువమంది నిరుపేదలేనని చెప్పారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో అందకపోవడంతో జీవన పోరాటం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో బతుకుదెరువు కోసం కొందరు గిరిజన కుటుంబాలు తమ ఆడబిడ్డలను అమ్ముకునే దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారంటే ఈ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. అభివృద్ధి అన్న మాట వినిపించకుండా దేవరకొండను కేవలం ఓటుబ్యాంక్లా మాత్రమే ఉపయోగించుకున్నారని విమర్శించారు.
దేవరకొండను జిల్లాగా ప్రకటిస్తే గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, ఉపాధి వనరులు పెరుగుతాయన్నారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులు విస్తరిస్తాయని, ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా చేరే అవకాశం ఉంటుందని వివరించారు. వెనుకబడిన దేవరకొండకు జిల్లా హోదా ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఇదే సరైన సమయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దేవరకొండ జిల్లా అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.