దేవరకొండ రూరల్, డిసెంబర్ 7: కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజక వర్గం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రగతిపథంలో దూసుకుపోయిందన్నారు. శనివారం దేవరకొండలో పర్యటించి ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆక్షేపణీయమన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనన్నారు ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ.600 కోట్లు మంజూరు చేశామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన రహదారులు పూర్తి చేస్తే చాలన్నారు. రెండేళ్లుగా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడ్వటం తప్ప నీవు చేసిందేముందని ప్రశ్నించారు. విజయోత్సవాల పేరుతో విచ్చలవిడిగా తిరుగుతూ వికృతంగా మాట్లాడుతున్నావన్నారు. అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన వాస్తవాలు మరుగున పడవని, కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలు విస్మరించరన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, వల్లపురెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, చంద్రమౌళి,పరమేష్, జానీబాబా,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.