గరిడేపల్లి, నవంబర్ 3 : విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వసతులు కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో రూ.200కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆదివారం ఇరిగేషన్, సివిల్ సైప్లె శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్డు రవాణా భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు.
దీపావళి పండుగ రోజు 7.50లక్షల మంది నిరుపేద విద్యార్థుల కోసం మెస్, కాస్మోటిక్స్ చార్జీలు ఒక్కసారిగా 40శాతం పెంచుతూ ఆదేశాలు విడుదల చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామన్నారు. ఒకే ఏడాదిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.5వేల కోట్లు కేటాయించామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. 20 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామన్నారు.
వానకాలంలో 150లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించాలని, సన్నరకాలకు రూ.500బోనస్ ఇస్తున్నామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఊటీ లాంటి చెరువులు, చెట్లు, గుట్టల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణలో మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాలకు డబుల్ రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, జడ్పీ సీఈఓ అప్పారావు, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, తాసీల్దార్ బండ కవిత, ఎంపీడీఓ సరోజ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీలు కటకం ఆశ రమేశ్, పైడిమర్రి రంగనాథ్, ఎల్ 27లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ సుందరి నాగేశ్వర్రావు, ఆరెపురి నారాయణ, బాణోతు శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.