అన్నీ ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు.. కొన్ని ఆహ్లాదం పంచేవి. సౌకర్యవంతమైనవి మరికొన్ని ఎందరికో ఉపాధి నిచ్చేవి. బీఆర్ఎస్ సర్కారులోనే బ్రహ్మాండంగా దాదాపు పనులన్నీ పూర్తి చేసుకున్నాయి. కేవలం తుది మెరుగులు దిద్దితే చాలు. కానీ కాంగ్రెస్ సరారు మాత్రం వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మనస్సు రావడం లేదు. జనం మొరపెట్టుకుంటున్నా వాటి దిశగా కనీసం చూడడం లేదు.
– యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)
గీతకార్మికుల సంక్షేమం కోసం భువనగిరి మండలంలోని నందనం గ్రామం లో నీరా ప్లాంట్ ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. గీత కార్మికులకు ఆసరాగా నిలువడంతోపాటు ప్రజలకు నీరా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఆ మేరకు నందనంలో నాలుగు ఎకరాల్లో భవనం నిర్మించేందుకు రూ.8కోట్లు విడుదల చేసింది. 2022 జూలై 29న అప్పటి మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నాటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నీరా కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాదే భవన నిరాణాలు పనులన్నీ పూర్తయ్యాయి. నీరా నిల్వకు అవసరమైన వివిధ రకాల యంత్రాలను కూడా అమర్చారు. అన్నీ రెడీగా ఉన్నా ప్రస్తుతం కేంద్రాన్ని ప్రారంభించకుండా తాళం వేయడంతో నిరుపయోగంగా మారింది.
యాదగిరిగుట్ట ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా వైటీడీఏ నిధులతో ఎకరన్నరంలో రాయగిరిలో మినీ శిల్పారాయం ఏర్పాటు చేశారు. స్వాగత తోరణం, పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేద తీరేందుకు మైదానం సిద్ధం చేశారు. రాత్రివేళల్లో పరిసరాలన్నీ జిగేల్ అనిపించేలా తీర్చిదిద్దారు. శిల్ప, హస్తకళా వైభవం ఉట్టిపడే విధంగా రాయగిరి చెరువుకు సొబగులు అద్దారు. పనులన్నీ పూర్తయినా కాంగ్రెస్ సరారులో మినీ శిల్పారామం ప్రారంభానికి నోచడం లేదు. దాంతో శిల్పారామంలో ఏర్పాటుచేసిన ఆట వస్తువులు, పుడ్ కోర్టులు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతున్నాయి.
జిల్లా కేంద్రంలో అంబేదర్ భవనం నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగన్నగూడెం రస్తా సమీపంలో గల సర్వే నంబర్ 629లో 900 గజాల స్థలం కేటాయించింది. 2017 డిసెంబర్ రెండున భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ క్రమంలో నిర్మాణానికి స్థలం సరిపోదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దృష్టికి కమిటీ సభ్యులు తీసుకెళ్లగా ఆయన చొరవతో కలెక్టర్ అదే సర్వేనంబర్‌లో అదనంగా 1,810 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. పనులు ప్రారంభించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో చిన్న చిన్న సమావేశాల కోసం ఓపెన్ హాల్, జీ ప్లస్‌లో అంబేదర్ ఆడిటోరియం, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి వీలుగా స్టడీ సరిల్, గ్రంథాలయం, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవన నిర్మాణ పనులు ఎప్పుడో తుది దశకు చేరుకున్నాయి. కానీ ప్రారంభానికి మాత్రం నోచడం లేదు.
కూరగాయలు, పండ్లు, మాంసం ఉత్పత్తులు పట్టణ ప్రజలకు ఒకేచోట అందుబాటులో ఉండేలా భువనగిరిలో నిర్మించిన సమీకృత మారెట్ పనులు తుది దశలో నిలిచిపోయాయి. మారెట్లో 192 స్టాళ్లు నిర్మించారు. నాన్‌వెజ్‌కు 48, వెజ్‌కు 102, పండ్లు, పూల విక్రయాలకు 20, ఇతర వస్తవుల విక్రయానికి 13 స్టాళ్లు నిర్మించారు. రంగులు వేయడం, సెట్టర్లు బిగించడం పూర్తయ్యింది. సిమెంట్ కాంక్రీట్ (సీసీ), విద్యుత్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారులో ఏడాది కాలంగా పైసా విడుదల కాకపోవడంతో ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం స్పందించి ఈ నిర్మాణాలు అన్నింటినీ అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.