రామగిరి, మే 15 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఈ నెల 17నుంచి జూన్ 16 వరకు వివిధ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి వర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. అయితే ఉన్నత విద్యామండలి నిబంధనల మేరకు పరీక్షల నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమితి ఉండదని పరీక్షల విభాగం ఇప్పటికే వెల్లడించింది.
పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రత్యేక పరిశీలకులు అప్రమత్తంగా ఉండి పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా నిబంధనల మేరకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6 సెమిస్టర్లతోపాటు 1, 3, 5 సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల నిర్వహణకు 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఆయా సెమిస్టర్ల పరీక్షలకు మొత్తం 54,444 విద్యార్థులు హాజరుకానున్నుట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డా॥ జి.ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్ పరీక్షల అధికారిణి డా॥ లక్ష్మీప్రభ వెల్లడించారు.
రెగ్యులర్ విభాగంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే 2వ సెమిస్టర్ పరీక్షలకు 12,525, నాలుగో సెమిస్టర్ 12,313, ఆరో సెమిస్టర్ పరీక్షలకు 11,554 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే బ్యాక్లాగ్ పరీక్షల్లో భాగంగా సెమిస్టర్-1 పరీక్షలకు 6,923, సెమిస్టర్-3 6,050, సెమిస్టర్-5 పరీక్షలకు 5,079 మంది కలిపి మొత్తం 54,444 మంది పరీక్షలు రాయనున్నారు.