భువనగిరి అర్బన్, నవంబర్ 26: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. నేను చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..అంటూ చావునోట్లో తలపెట్టి దీక్ష చేపట్టినందునే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం పట్టణ పరిధిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాదు అనుకున్నా.. ఇది కాదు అనుకున్నా.. తన ప్రాణం పోతుందని తెలిసి కూడా వెనకడుగు వేయకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే దృఢ సంకల్పంతో దీక్ష చేపట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ పేరు, ఘనత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈనెల 29న యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేసేందుకు, నాడు దీక్షలో పాల్గొన్న అన్ని అనుబంధ సంఘాలను కలుపుతూ మేధావులు, విద్యార్థులు, తెలంగాణ సాధనకు పాటుపడిన ప్రతి ఒకరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేసే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ దీక్షలో 10 వేల మందికి తగ్గకుండా అన్ని వర్గాలవారు పాల్గొనేలా చూడాలన్నారు.
తెలంగాణ అంటేనే కేసీఆర్: మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
తెలంగాణ అంటేనే కేసీఆర్ అని….కేసీఆర్ అంటేనే తెలంగాణ గుర్తుకొస్తుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. రాష్ట్రం వస్తదో రాదో అనే ధోరణి ఉంటే తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రతి మనిషి గుండెల్లో చిరస్థాయిగా గూడుకట్టుకొని ఉన్నారన్నారు.
కేసీఆర్ పేరు చరిత్రలోనే నిలుస్తుంది: మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం కేసీఆర్ పేరు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సాధించిన ఘనత, రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మరువలేరని కొనియాడారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధి చెరగని స్తిరాస్థి: గాదరి
రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని, పథకాలతో పది సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దీక్షా దివస్లో విద్యార్థులు మేధావులు తోపాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల కృష్ణారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్, రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, యాదగిరి, బీఆర్ఎస్ భువనగిరి పట్టణ, మండల అధ్యక్షులు ఏవీ కిరణ్ కుమార్, జనగాం పాండు, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓం ప్రకాశ్ గౌడ్తోపాటు జిల్లా నాయకులు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.