దామరచర్ల, సెప్టెంబర్ 18 : యూరియా కోసం రైతులు దామరచర్లలోని నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై గురువారం రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం వందల సంఖ్యలో గురువారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగినా దొరకక పోవడంతో ఆగ్రహంతో దామరచర్లలోని హైవేపై రాస్తారోకో చేపట్టారు. ఒక కట్ట యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున మూడుగంటలకే వచ్చి ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా యూరియా ఇవ్వడం లేదన్నారు.
వచ్చిన కొద్దిపాటి యూరియా కూడా తమ వరకు రావడం లేదని ఆరోపించారు. తండాల నుంచి వచ్చి పొద్దుటి నుంచి రాత్రి వరకు తిరుగుతున్నామని కానీ బస్తా యూరియా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక ఆందోళన చేస్తున్నామని అధికారుల వచ్చి తమకు యూరియా ఇచ్చేంతవరకు కదిలేది లేదని మహిళలు, రైతులు సుమారు అర్ధగంట సేపు రాస్తారోకో నిర్వహించడంతో రహదారికిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి రైతులకు నచ్చజెప్పినా వినలేదు. మిర్యాలగూడ రూరల్ సీఐ ప్రసాద్ వచ్చి రైతులకు నచ్చజెప్పి టోకెన్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
నిడమనూరులో రైతుల రాస్తారోకో..
నిడమనూరు, సెప్టెంబర్ 18 : నిడమనూరులోని హైవేపై యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల నుంచే నిడమనూరు ప్రాథమిక సహకార సంఘం వద్దకు చేరకున్న రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. ఉదయం 7 గంటలకు యూరియా రావడం లేదనే సమాచారంతో ఆగ్రహించిన రైతాంగం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
సుమారు రెండున్నర గంటలకు పైగా ఆందోళన కొనసాగడంతో ప్రధాన రహదారికిరువైపులా సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. పోలీసులు వచ్చి రైతులతో మాట్లాడి యూరియా రాగానే రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. రైతుల కోరిక మేరకు 150 మందికి టోకెన్లు ఇచ్చేందుకు పేర్లు రాసుకోవడంతో రైతులు శాంతించారు.
ఒక్క బస్తా కోసం ఎన్ని తిప్పలో..
శాలిగౌరారం, సెఫ్టెంబర్ 18 : ఒక్క బస్తా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. శాలిగౌరారంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలకు యూరియా వచ్చిందనే వార్త తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల రైతులు, మహిళా రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే మండల కేంద్రానికి భారీగా చేరుకున్నారు.
రైతులు ఎక్కవ మంది రావడంతో అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. దీంతో రైతులు కూడా వచ్చి పోలీస్‌స్టేషన్ వద్ద బారులు తీరారు. రెండు లారీల యూరియా రావడంతో రైతుకు ఒక్క బస్తా చొప్పున మండల వ్యవసాయ అధికారి రశీదు రాసి అందజేశారు. అదేవిధంగా మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామానికి ఒక్క లారీ యూరియా రావడంతో అక్కడ కూడా రైతులు క్యూలో నిలబడి యూరియా తీసుకెళ్లారు.
పోలీసుల సమక్షంలో పంపిణీ..
నాగారం, సెప్టెంబర్ 18 ః మండల పరిధిలోని నాగారం ఎక్స్‌రోడ్డు వద్ద ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, సాయినాథ్ ఫర్టిలైజర్ వద్దకు గురువారం యూరియా వచ్చిందనే సమాచారంతో పలు గ్రామాలకు చెందిన రైతులు వందల సంఖ్యలో వచ్చి రాత్రి సయమంలోనే ఆధార్ కార్డు జీరాక్సు కాపీలను లైనులో పేట్టారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం ఎదురు చూస్తూ క్యూలో నిల్చున్నారు. క్యూలో ఉన్నవారికి వారికి పోలీసుల సమక్షంలో ఒక్కొరికి ఒక బస్తా చొప్పున అందజేశారు. ఒక్క బస్తానే ఇవ్వడంతో పలువురు రైతులు ఆగ్రహం వ్యక్దం చేశారు.
టోకెన్లు తీసుకోవాలన్నా క్యూనే..
మఠంపల్లి, సెప్టెంబర్ 18 ః రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. దుకాణాల వద్దకు వెళ్ళి యూరియా కోసం బారులు తీరుతున్నా దొరకడం లేదు. వ్యవసాయాధికారులు టోకెన్ విధానం అమలు చేయడంతో గంటల తరబడి లైనులో నిలబడి టోకెన్ రాయించుకోవాలి. మరుసటి రోజు ఆ టోకెన్ తీసుకుని మళ్లీ క్యూలో నిలబడి యూరియా తీసుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి రోజూ అధికారులతో గొడవలు పడుతున్నా దిగుతున్నా యారియా మాత్రమ నామమత్రంగానే సప్లయి జరుగుతోంది.