కట్టంగూర్, ఆగస్టు 04 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులు డీఏపీ ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. పంటలకు అడుగు మందుగా డీఏపీ ఎరువును ఉపయోగిస్తారు. కానీ సహకార సంఘంలో డీఏసీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పదుతున్నారు. గత కొద్ది రోజులుగా పీఏసీఎస్ ద్వారా యూరియా మాత్రమే విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఉదయం 6 గంటల నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్దకు చేరుకుని యూరియా మాత్రమే తీసుకెళ్తున్నారు.
డీఏపీ ఎరువుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా, డీఏపీ వేర్వేరుగా దుకాణాల్లో తీసుకోవాలంటే నానా అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కూడా అందరికీ దొరకడం లేదు. ప్రభుత్వం సహకార సంఘానికి డీఏపీ ఎరువును సరఫరా చేసి అవసరాలను తీర్చాలని రైతులు కోరుతున్నారు.