నల్లగొండ, మార్చి 24 : దళిత బంధు రెండో విడు త నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి చైర్మన్ కందుల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ నియోజక వర్గంలో 1,056 మందికి దళిత బంధు రెండో విడుత నిధులు మంజూరు గత ప్రభుత్వం చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు తెలిపారు.
బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బులు జమ చేసిన తరువాత ఎన్నికల కోడ్ కారణంగా అకౌంట్లు ఫ్రీజ్ చేసిన అధికారులు తిరిగి గ్రౌండింగ్ కూడా చేయలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తమకు డబ్బు అందకుండా చేసిందని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని రెండో విడుత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆదిమల్ల లింగయ్య, తీగల ఎల్లేశ్, అశోక్, కత్తుల యాదయ్య, రూపని రవి, కిన్నెర వెంకన్న, వెంకటేశ్, మామిడి ఎల్లయ్య పాల్గొన్నారు.