యాదగిరిగుట్ట, ఆగస్టు 30 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలోని కల్యాణ మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హవనం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజ వాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీసమేతుడైన నారసింహస్వామిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతును నిర్వహించారు. ప్రధానాలయం ముఖ మండపంలో స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులతో సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు.
సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. ప్రధానాయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారిని పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాలు, వజ్రాభరణాలతో దివ్య మనోహరంగా అలకంరించిన అర్చకులు ఊంజల్ సేవలో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. అద్దాల మండపంలో వేదమంత్ర పఠనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మహిళా భక్తుల మంగళనీరాజనాల నడుమ ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వం గా సాగింది.
ఉదయం నుంచి సాయం త్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అనుబంధ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్యపూజలు స్మార్తగమశాస్త్రరీతిలో జరిగాయి. పలువురు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సుమా రు 15వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.29,99,608 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావు తెలిపారు.