రామగిరి, మ 6 : తమకు హక్కుగా రావాల్సిన వాటిని అడిగినందుకు సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, తనను కోసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(ఎస్జీపీఏటీ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాడి భాస్కర్‌రెడ్డి, సీహెచ్ సుధాకర్‌రెడ్డి అన్నారు.
నల్లగొండలోని సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. 30 సంవత్సరాలుపైబడి విద్యార్థులను తీర్చిదిద్ది సేవ చేశామని, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇలా స్పందించడం సమంజసంగా లేదన్నారు. ఇది పెన్షనర్స్‌ను అవమానించడమేనని, భవిష్యత్తులో కూడా తమ ఆర్థిక పరమైన డిమాండ్లను పరిష్కరించలేమనే చెప్పడం సీఎంకు తగదని తెలిపారు. వాగు దాటే వరకు ఓడ మల్లయ్య వాగు దాటినంక బోడ మల్లయ్య అన్న చందంగా సీఎం వైఖరి ఉందని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ ఎన్.అరుణాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.