ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఆఖరికి కన్నీరే మిగులుతున్నది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చేసిన కష్టమంతా వర్షార్పణమవుతున్నది. ఇటీవల వరుసగా భారీ ఈదురు గాలులతో కురుస్తున్న వానలకు పంట తడిసి ముద్దవుతున్నది. మామిడి తోటల్లో కాయలు నేల రాలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి సీజన్లో 3.19లక్షల ఎకరాల్లో సాగు అంచనా ఉండగా, 2.80లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇందులో అధిక శాతం వరి సాగు చేశారు. ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు ఎర్రటి ఎండలతో కండ్లముందే వరి పొలాలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు పంటలు ఎండిపోవడంతో పశువులకు మేతగా వినియోగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 20వేలకు పైగా ఎకరాలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో సుమారు రెండు లక్షలకు పైగా రైతులు ఉన్నారు.
800 ఎకరాల్లో పంట నష్టం..
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. ఈ నెల 3,13,15, 20 తేదీల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దాంతో జిల్లాలో సుమారు 800 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. ముఖ్యంగా తుర్కపల్లి, బొమ్మలరామారం, మోత్కూరు, రామన్నపేట, చౌటుప్పల్, వలిగొండ, యాదగిరిగుట్ట తదితర మండలాల్లో నష్టం జరిగింది. ఒక్కో ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినా.. రూ.నాలుగైదు కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మామిడి తోటలు లీజుకు తీసుకున్న వారు సైతం నష్టం చవిచూడాల్సి వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో రూ. 7 కోట్ల పరిహారం..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పదేండ్ల పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. సాగు నీరు, పెట్టుబడి సాయం, ఎరువులు, మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు సైతం సజావుగా కొనసాగాయి. పంట నష్టం జరిగిన సమయంలో రైతులను ఆదుకునే ప్రయత్నం చేసింది. 2023లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దీంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించింది. ఇలా జిల్లాలో రూ. 7కోట్ల సాయం అందించి రైతులపై ఉన్న ప్రేమను చాటుకుంది.
కనీసం భరోసా కూడా ఇవ్వని కాంగ్రెస్..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం దేవుడెరుగు కనీసం ధైర్యం, భరోసా కూడా కల్పించలేదు. పంట నష్టానికి సంబంధించి పరిహారంపై ప్రకటన చేయలేదు. కేవలం వ్యవసాయ అధికారులను ప్రాథమిక నష్టం జాబితా పంపించాలంటూ ఆదేశాలు జారీ చేసి.. చేతులు దులుపుకొన్నది. మరోవైపు సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పత్తాలేకుండా పోయింది. ఏకంగా హస్తం పార్టీ మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా ఊసేలేదు.
పంట నష్ట పరిహారం చెల్లించాలి
జిల్లాలో వరుస అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. ప్రభుత్వం పంట పెట్టుబడి ఇవ్వకున్నా అప్పోసొప్పో తెచ్చి పండించినా వరుణుడు కరుణించలేదు. రైతులు అప్పుల పాలై దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ సర్కారు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాల్సిందే.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు
వెయ్యెకరాల్లో నిమ్మ తోటలు ధ్వంసం
నకిరేకల్, ఏప్రిల్ 23 : ఇటీవల వచ్చిన ఈదురుగాలుల వర్షానికి నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున నిమ్మ తోటలకు నష్టం వాటిల్లింది. కాతకు వచ్చి నిమ్మకాయ తెంపే దశలో పెద్దఎత్తున నష్టం వాటిళ్లడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. బయట వడ్డీలకు తెచ్చి, కొంత మేర ఫర్టిలైజర్ షాపులకు బాకీలు పెట్టి పెట్టుబడులు తెచ్చామని, తీరా తెంపేదశలో గాలిదుమారానికి చెట్లన్నీ నేలకొరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నకిరేకల్ మండలంలోని కడపర్తిలో 38 మంది రైతులకు చెందిన 200 ఎకరాల్లో, నోములలో 40 మంది రైతుల 180 ఎకరాల్లో, పాలెంలో 45 మంది రైతుల 180 ఎకరాల్లో, వల్లభాపురంలో ఆరుగురు రైతుల 25 ఎకరాల్లో, నడిగూడెంలో నలుగురు రైతుల 15 ఎకరాల్లో, ఓగోడులో ముగ్గురు రైతుల 6 ఎకరాల్లో, తాటికల్లో ఐదుగురు రైతుల 15 ఎకరాల్లో, నకిరేకల్‌లో ఐదుగురు రైతుల 15 ఎకరాల్లో నిమ్మచెట్లు ధ్వంసమయ్యా యి.
శాలిగౌరారం మండలంలోని శాలిగౌరారంలో 8 మంది రైతులకు సంబంధించిన 16 ఎకరాల్లో, పెర్కకొండారంలో 36 మంది రైతుల 120 ఎకరాల్లో, ఆకారంలో నలుగురు రైతుల 10 ఎకరాల్లో, పాతకొండారంలో ఇద్దరు రైతుల 5 ఎకరాల్లో, వల్లాలలో 65 మంది రైతుల 240 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. కేతేపల్లి మండలంలోని గుడివాడలో నలుగురు రైతులకు చెందిన 14 ఎకరాల్లో నిమ్మతోటలు ధ్వంసమయ్యాయి. మూడు మండలాల్లో 265 మంది రైతులకు సంబంధించిన 1,032 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు ఉద్యానవన అధికారి ప్రవీణ్ పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఎకరానికి రూ.2 లక్షల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నిమ్మతోటకు వస్తే కన్నీళ్లు వస్తున్నాయి..
ఎంతో కష్టపడి సాగు చేసిన నిమ్మతోట ఈదురుగాలులకు నేలమట్టం అయ్యింది. తోటకు రావాలంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాకున్న 3 ఎకరాల్లో 220 నిమ్మ మొక్కలు నాటాను. కాయ చేతికొచ్చే సమయానికి దాదాపు 50 చెట్లు వేర్లతో లేచి పడ్డాయి. 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. బయట లక్షా 50 వేలు అప్పు తెచ్చిన. ఎరువుల షాపులో లక్షా 50 వేలు బాకీ ఉంది. మొత్తం 3 లక్షలు కట్టాలి. ఈ కారు పంట చేతికొస్తే అప్పు పోనూ లక్ష రూపాయలు చేతి కొచ్చేది. పెట్టిన పెట్టుబడి పోయింది. అప్పు మిగిలింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
-బెల్లి వెంకన్న, రైతు, టేకులగూడెం