కొండమల్లేపల్లి, నవంబర్ 7: పత్తి రైతులను తుపాను నిండా ముంచింది. యూరియా కొరత, వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. నిన్న, మొన్నటి వరకు యూరియా కోసం పడరాని పాట్లు పడగా, తీరా యూరియా దొరికినా పంట చేతికొచ్చే సమయంలో తుపాను రూపంలో గండం ఎదురైంది. దీంతో పత్తి రైతుకు ఏటా తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కుదామనుకుంటే నిరాశే మిగిలింది. సీజన్ ప్రారంభంలో ఆరకొర వర్షాలతో పత్తి గింజలు మొలకెత్తకపోవడంతో రెండు మూడుసార్లు నాటాల్సి వచ్చింది.
తీరా పంట చేతికి వచ్చే సమయానికి అతివృష్టి దెబ్బతీసింది. మండలంలోని చిన్నఅడిశర్లపల్లి, గుమ్మడవెల్లి, చెన్నారం, గాజీనగర్ గ్రామాల్లో భారీ, అతిభారీ వర్షాలతో కొన్ని చోట్ల మొక్కలు జాలువారగా, మరికొన్నిచోట్ల పత్తి చేలల్లో పూత, కాత రాలిపోయింది. మిగతా మొత్తం వర్షాలకు నల్లబడిపోయింది. ఫలితంగా పంట దిగుబడి తగ్గి రైతన్నకు కన్నీరే మిగిలింది. ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు ప్రస్తుతం 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సుమారు నెల రోజుల క్రితమే కూలీలతో పత్తి తీసేందుకు రైతులు అన్నీ సిద్ధం చేస్తుండగానే భారీ, అతి భారీ వర్షాలు పడి పంట దిగుబడి భారీగా పడిపోయింది. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వర్షాలు తమను నిండా ముంచాయని, తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియడం లేదని రైతులు దుఃఖిస్తున్నారు. పది రోజులుగా తుపాన్ల రూపంలో వచ్చిన వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కష్టపడి పండించిన పత్తి పంటను వర్షాలు మట్టిపాలు చేశాయి. వర్షాల కారణంగా కూలీలు పత్తి తీయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. అధిక వర్షాల కారణంగా దిగుబడి లేక పత్తి నల్లబడింది. దీంతో కొనుగోలు లేకపోవడంతో రైతులు పత్తి పంటలను జీవాలకు గ్రాసంగా మేపుతున్నారు.
ఓ వైపు అతివృష్టితో తెల్ల బంగారం దిగుబడులు తగ్గిపోగా, మరో వైపు కూలీల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీనికి తోడు కూలీల రేట్లు రెండింతలై పత్తి రైతుకు ఆర్థికంగా భారమైంది. పత్తి ఏరేందుకు దూర ప్రాంతాల నుంచి కూలీలను ఉదయమే వాహనాల్లో రప్పిస్తూ సాయంత్రం తిరిగి పంపిస్తున్నారు. ఈ సారి తెల్ల బంగారం సిరులు కురిపిస్తుందన్న ఆశతో మండల పరిధిలో 12.500 ఎకరాల్లో ఎక్కవ మంది రైతులు పత్తి సాగు చేశారు. కొద్ది రోజుల క్రితం రోజుకు రూ.300 కూలీ ఉండగా ప్రస్తుతం కూలీల కొరత కారణంగా రూ.400 చెల్లించాల్సి వస్తోంది. పైగా వాహనాదారుడు ఒక్కో కూలీకి రూ.50 చొప్పున తీసుకుంటున్నాడు.
ఐదెకరాలు భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశా. పెట్టుబడికి రూ.2 లక్షలు అప్పు చేసి సాగు చేస్తే అధిక వర్షాలు పత్తి పంటను దెబ్బతీశాయి. వర్షాలు రాకపోతే ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ఆశించాం. కానీ వర్షాలతో ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. రూ.రెండు లక్షలు పెట్టుబడి పెడితే రూ.లక్ష మాత్రమే దిగుబడి వచ్చింది. చేసిన కష్టం మొత్తం వృథా అయింది. పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. చెట్టుకు వచ్చిన ఒకటి రెండు కాయలు ఏరగా కూలీలకే పైసలు సరిపోయేలా లేవు. దీంతో మంద పెట్టిస్తామని కాపరులు చెప్పడంతో గొర్రెల మేతకు వదిలేశాం.
– గుండాల మల్లయ్య, రైతు పెండ్లి పాకల