నీలగిరి, జూలై 22 : యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే ఎరువుల దుకాణం యజమానితో పాటు, సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎరువులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని”, టోల్ ఫ్రీ నంబర్ 18004251442 ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగునీరు వస్తుండడం, అలాగే జిల్లా వ్యాప్తంగా ముమ్మర వ్యవసాయ సాగు, విత్తనాలు, నాట్లు వేసే సమయంలో సైతం అవసరమైనన్ని ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఎవరికైనా ఎరువులకు సంబంధించి ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఒకేసారి 30 లేదా 40 బస్తాల ఎరువులను తీసుకువెళ్లే వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువుల పర్యవేక్షణకై ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. తాసీల్దార్లు, ఏఓలు ఎరువుల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. మిర్యాలగూడ ఎరువుల గోదామును ఎప్పటికప్పుడు తాము సందర్షిస్తున్నట్లు, ఈ నెలాఖరులోగా జిల్లాకు 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానున్నదని తెలిపారు.
ఎరువుల దుకాణం యజమానులు దుకాణం ముందు తప్పనిసరిగా ఎరువుల నిల్వలపై బోర్డులను ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసే విధంగా ఎరువుల వివరాలు ప్రదర్శించాలని, ఏరోజుకారోజు ఎరువుల స్టాక్ వివరాలను ఆబోర్డుపై నమోదు చేయాలన్నారు. ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాటుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్ పాల్గొన్నారు.