మునుగోడు, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) మునుగోడు మండల శాఖ అధ్యక్షుడు మిర్యాల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపస్ నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం భోజన విరామ సమయంలో మునుగోడు మండల తాసీల్దార్ నేలపట్ల నరేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 1 సెప్టెంబర్,2004 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ నల్లగొండ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పిండి వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయుడు బాబురావు పాల్గొన్నారు.