మునుగోడు, జూన్ 28 : కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉప సంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ జులై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేతిలో పెట్టే విధంగా కొమ్ము కాయడం దారుణమని మండిపడ్డారు.
కార్మిక వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర చట్టం చేయాలన్నారు. జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, శివర్ల వీరమల్లు, యాట యాదయ్య, పగడాల కాంతయ్య, కొంక రాజయ్య, దొండ వెంకన్న పాల్గొన్నారు.