రామగిరి, డిసెంబర్ 29 : వందేళ్లు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాదేనని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో పనిచేసిన చరిత్ర తమ పార్టీదేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ 100 వసంతాల వేడుకల సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించే బహిరంగ సభ సందర్భంగా ఆదివారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, కార్మిక సమస్యల పరిష్కారంలో సీపీఐ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. నైజాంకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరి, దోపిడీ నుంచి విముక్తి కోసం ఉద్యమాలు చేశారని చెప్పారు. సీపీఐ నాయకత్వంలో మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు.
కార్మికుల 8 గంటల పని దినం, న్యాయబద్ధమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, విద్యార్థి తదితర సంఘాల ఏర్పాటు కోసం పార్టీ ఉద్యమాలు చేసిందని చెప్పారు. దున్నే వారికి భూమి కోసం న్యాయమైన పోరాటం చేసి 10లక్షల ఎకరాలను పేదలకు అందించిన చరిత్ర సీపీఐదేనన్నారు. మతోన్మాద బీజేపీ అధికారంలోకి రాకుండా బీజేపీయేతర రాజకీయ పార్టీలను ఏకంచేసి నిలువరించామని గుర్తు చేశారు. ప్రతి పక్షంలో ఉండి అటు పార్లమెంట్, ఇటు శాసన సభల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీశామన్నారు. పోరాట చరిత్ర కలిగిన నల్లగొండ గడ్డపై పార్టీ 100వ ఆవిర్భావ వేడుకలను నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
15వేలమందికిపైగా కమ్యూనిస్టులు ఎర్ర దుస్తు లు ధరించి ఇక్కడికి వస్తారని చెప్పారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ వందేండ్ల ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సీపీఐ కార్యకర్తలు, యువగళం, కళాకారులు ఎర్రటి దుస్తులు ధరించి మధ్యాహ్నం 1:30 గంటలకు నల్లగొండలో గడియారం సెంటర్ నుంచి సభా వేదిక వరకు మహా ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటలకు వరకు సభ జరుగుతుందని చెప్పారు.
ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పలాల నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, లొడంగి శ్రవణ్‌కుమార్, వీరస్వామి, ఏఐఎస్ఎఫ్ఐ నాయకుడు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.