భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 28 : ఎన్నికల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాజేస్చంద్ర, అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోకవర్గాలకు సంబంధించిన ఓటర్లకు పోల్ స్లిప్‌లను పంపిణీ చేశామన్నారు.
నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని సూచించారు. ఓటర్లు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కా ర్డును కలిగి ఉండాలన్నారు. పోలింగ్ సందర్భంగా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ చేపట్టామని, భారీ బందోబస్సు ఏర్పాటుల చేశామని చెప్పారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సంబంధించి డిసెంబర్ 3న పట్టణ పరిధిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు పక్రియకు ఏర్పాటు చేశామన్నారు.
ఈవీఎంలు మొరాయిస్తే తక్షణమే ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పనిచేసే వాహనాలకు జీపీఆర్ఎస్ అం దుబాటులో ఉందన్నారు. డీసీపీ రాజేష్‌చంద్ర మాట్లాడుతూ అక్రమ మద్యం, నగదు తరలింపులను నియంత్రించేందుకు జిల్లాలో 10 చెక్‌పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గానికో ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు. పోలింగ్బూతుల వద్ద 100మీటర్ల దూరాన్ని పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీడియో చిత్రీకరణకు చర్యలు చేపట్టామన్నారు.