నీలగిరి మే 16 : నల్లగొండ పట్టణంలో గురువారం అర్ధరాత్రి నల్లగొండ పోలీసులు డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ నిర్వహించారు. గురువారం రాత్రి 11 గంటల నుండి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు పట్టణంలోని మాన్యంచెల్కలో సుమారు 500 ఇండ్లలో మాదక ద్రవ్యాలను పసిగట్టే స్నైపర్ డాగ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డులతో ఆన్లైన్లో విచారణ చేశారు.
ఈ తనిఖీల్లో నలుగురు రౌడిషీటర్లుతోపాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరికి గంజాయి పరీక్షలు నిర్వహంచగా వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా వచ్చింది. అలాగే పత్రాలు సక్రమంగా లేని 165 వాహనాలను, నాలుగు ఆటోలను సీజ్ చేశారు. ఇవే కాకుండా హుక్కా, గాంజా చాక్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారందరికి కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి నాకాబందీలో దొరికితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.కమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా పట్టణంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
అనుమానస్పదంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని, గంజాయి తదితర మాదకద్రవ్యాలను నిలువరించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నట్లు కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.