నల్లగొండ, అక్టోబర్ 24 : బాలికపై అత్యాచారం చేసి ఏడు నెలల గర్భవతిని చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ పోక్సో కోర్టు 21 ఏండ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధించింది. కేసు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన చింతపల్లి నగేశ్ వరసకు చెల్లెలు అయిన బాలికను అత్యాచారం చేసి 7 నెలల గర్భవతిని చేశాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. విషయం వెలుగు చూడడంతో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బెదిరింపులు, అత్యాచారం, పోక్సో వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో వ్యక్తి దోషిగా తేలడంతో పోక్సో యాక్ట్ కింద 20 సంవత్సరాలు, రూ.25 వేల జరిమానా, 506 IPC కింద ఏడాది జైలు రూ.5 వేల జరిమానా, మొత్తం కలిపి 21 ఏండ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే బాధితురాలికి డీఎస్ఎల్ఏ ద్వారా రూ.10 లక్షల పరిహారం అందించాలని తీర్పు వెల్లడించిందని ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో సరైన సాక్ష్యాదారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి దోషికి శిక్ష పడేలా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సురేశ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాలగోపాల్, అలాగే ప్రాసిక్యూషన్ కు సహకరించిన నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ.రాజశేఖర్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్, సీడీఓ వెంకటేశ్వర్లు, లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె.కల్పన, లైజెన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ లను ఎస్పీ అభినందించారు.