నీలగిరి, జూలై 26 : భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తెలియజేసి పరిష్కరించుకునేందుకు నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ తో పాటు రెండు రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25 మంది సిబ్బందితో కంట్రోల్ రూమ్, రెస్క్యూ టీములను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నీటి స్తబ్దత, నీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రెయిన్లు, శిథిలావస్థలో ఉన్న పాత ఇంటి కాంపౌండ్ గోడలు, పట్టణంలోని రోడ్లపై చెట్లు కూలిపోవడం వంటి పరిణామాలు సంభవించిన ప్రదేశాలను పర్యవేక్షించడానికి, షిఫ్ట్ సిస్టమ్ ద్వారా అక్కడికక్కడే తక్షణ చర్య తీసుకోవడానికి అవసరమైన వాహనాలతో పాటు 24/7 రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఏమైనా సమస్యలు వస్తే వెంటనే టోల్ ఫ్రీ ల్యాండ్ లైన్ నంబర్ 08682220100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కంట్రోల్ రూమ్ లో మూడు షిఫ్టుల్లో ముగ్గురు అధికారులను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఏసీపీ, డీఈ, శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు మరో ఎనిమిది మంది చొప్పున రెండు రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.