నందికొండ, ఆగస్టు 6 : కృష్ణానది జోరుగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరుకోవడంతో సోమవారం డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించగా మంగళవారం కూడా కొనసాగింది. రిజర్వాయర్ నీటి మట్టం 585.20 ( 298.01 టీఎంసీలు) అడుగులకు చేరగానే డ్యామ్ క్రస్ట్ గేట్ల సంఖ్యను 16 నుంచి 20కు పెంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు 20 క్రస్ట్ గేట్లు (4 గేట్లు 5 అడుగులు, 16 గేట్లు 10 అడుగులు) ఎత్తి 3,00,995 క్యూసెక్కులు నీటిని దిగువగు విడుదల చేశారు.
శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,08,770 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా 3,08,770 , ఎస్ఎల్బీసీ ద్వారా 1800, ఎడమ కాల్వ ద్వారా 8,022, కుడి కాల్వ ద్వారా 8,067, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 2,8,420 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు మొత్తం ఇన్‌ఫ్లో 3,1,5010, అవుట్‌ఫ్లో 3,55,079 క్యూసెక్కులు కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 883.10 అడుగులు ఉంది.
ఎడమ కాల్వకు 8 వేల క్యూసెక్కులు
ఆగస్టు 2 నుంచి సాగర్ ఎడమ కాల్వకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్‌కు వరద పోటెత్తడంతో ఎడమ కాల్వ నీటి విడుదలను క్రమంగా 8 వేల క్యూసెక్కులకు పెంచారు. ఇంకా నీటి విడుదలను పెంచే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
పర్యాటకుల సందడి
సాగర్ డ్యామ్‌పై నుంచి పాల పొంగుతో జాలువారుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. డ్యామ్ పరిసరాల్లో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. చేపల ఫ్రై, తినుబండారాలు, ఐస్‌క్రీమ్స్ తింటూ సరదాగా గడిపారు.