పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 30 : ఇంతకుముందు వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణపై ఆధారపడ్డ అన్నదాతలు ఇప్పుడు కోళ్ల పెంపకంపైనా దృష్టి సారిస్తున్నారు. దీంతో గతంలో పట్టణ సమీప ప్రాంతాలకే పరిమితమైన పౌల్ట్రీఫామ్‌లు ఇప్పుడు పల్లెల్లోనూ వెలుస్తున్నాయి. ఇందుకు బ్యాంకులు రుణ సహాయం అందిస్తుండడంతో గ్రామీణ రైతులు పొలాల్లో షెడ్ల నిర్మాణం చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నారు. పెద్దఅడిశర్లపల్ల్లి మండలంలో ఒకప్పుడు సాగునీరు లేక బీళ్లుగా మారిన భూములు ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. మరోవైపు పొలాల మధ్య పౌల్ట్రీ రంగంలో గిరిజన రైతులు రాణిస్తున్నారు. మండలంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు ఓ పక్క వ్యవసాయం చేసుకుంటూనే.. మరోపక్క బ్యాంకు రుణంతో షెడ్లు ఏర్పాటు చేసుకుని కోళ్ల పెంపకం చేపడుతున్నారు. ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత సైతం ఉన్న ఊర్లోనే కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు.
పీఏపల్లి మండలంలో సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వ్యవసాయం చేస్తూనే.. అదనపు ఆదాయం కోసం తమ పొలాల్లో కోళ్ల ఫామ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. సహకార, ఇతర బ్యాంకులు రుణ సహాయం చేయడంతో రూ.15లక్షల వరకు వెచ్చించి 5వేల నుంచి ఆరు వేల కోడి పిల్లల సామర్థ్యంతో షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు రైతులు వ్యవసాయం చేయడానికి అనువుగా లేని భూములను చదును చేసి కోళ్ల షెడ్లు నిర్మించి ఉపాధి పొందుతున్నారు. కొంతమంది సొంతంగా కోడి పిల్లలను కొనుగోలు చేసి 50 రోజులు పెంచి విక్రయిస్తుండగా.. మరికొందరు ప్రైవేటు కంపెనీలు ఇచ్చిన కోడి పిల్లలను పెంచి సదరు కంపెనీకే విక్రయిస్తున్నారు. ఇలా పెట్టుబడి లేకుండానే రైతులు కోళ్లను పెంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా మల్లాపురం, వద్దిపట్ల, పుట్టంగండి సమీపంలో పెద్ద ఎత్తున గిరిజన రైతులు కోళ్ల ఫామ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. మార్కెట్‌ను బట్టి కిలో కోడి రూ.70 నుంచి వంద రూపాయల వరకు ధర పలుకుతుండడంతో పెట్టుబడి పోను ప్రతి 50 రోజులకు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెప్తున్నారు.
కంపెనీల సహకారంతో..
హైదరాబాద్‌కు చెందిన ఓ పౌల్ట్ట్రీఫామ్ కంపెనీతో స్థానిక రైతులు ఒప్పందం చేసుకుని కోళ్లను పెంచుతున్నారు. సదరు కంపెనీలు కోడి పిల్లలు, 50 రోజులకు సరిపడా దాణా అందిస్తున్నది. 50 రోజులు పెంచితే కిలోకు ఆరు నుంచి ఏడు రూపాయల వరకు రైతులకు కమీషన్ ఇస్తున్నది. దీంతో ఆరు వేల కోళ్లను పెంచితే 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుండగా.. రూ.60వేల నుంచి రూ.70వేల వరకు శ్రమ పెట్టుబడితోనే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను కూడా చెల్లించారు. దీంతో చాలా మంది రైతులు పౌల్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారు.
నాలుగేండ్లలో పెట్టిన పెట్టుబడి తీరింది
నేను గ్రామానికి దూరంగా గుట్టల నడుమ వృథాగా ఉన్న వ్యవసాయ భూమిలో నాలుగు సంవత్సరాల క్రితం రూ.15లక్షలతో కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకున్నా. మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఫామ్‌లో కోళ్లను పెంచుతున్నా. ఐదు నుంచి ఆరు వేల కోళ్లను పెంచితే రెండు నెలలకోసారి 10 టన్నుల దిగుబడి వస్తుంది. ఒక్కో బ్యాచ్‌కు పెట్టుబడిపోను రూ.70వేల వరకు ఆదాయం వస్తుంది. షెడ్డు కోసం పెట్టిన రూ.15 లక్షల పెట్టుబడి ఖర్చు ఇప్పటికే తీరిపోయింది.
– షేక్ సైదావలీ, మల్లాపురం, పీఏపల్లి మండలం
ప్రైవేటు ఉద్యోగం మానేసి పౌల్ట్రీ ఫామ్ పెట్టాను
నేను డిప్లమో పూర్తి చేశా. గతంలో ప్రైవేట్ జాబ్ చేసేది. స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంలో జాబ్ మానేశా. బ్యాంకు నుంచి రూ.15లక్షల లోన్ తీసుకొని మాకున్న మూడు ఎకరాల భూమిలో కోళ్ల షెడ్ ఏర్పాటు చేసుకున్న. ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో కోళ్లను పెంచుతున్న. 50 రోజులకు కంపెనీ వాళ్లకు అప్పజెప్పడంతో కిలోకు రూ.6.50 పైసలు కమీషన్ ఇస్తున్నారు. కూలీలతో పని లేకుండా నేను, నా భార్య రోజుకు మూడు, నాలుగు గంటలు ఫామ్‌లో పనిచేస్తున్నాం. 50 రోజులకు రూ.60వేల నుంచి 70వేల రూపాయల వరకు మిగులుతున్నాయి.
– రమావత్ శివ, వద్దిపట్ల, పీఏపల్లి మండలం