నల్లగొండ, అక్టోబర్ 16 : బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ బిల్లు ప్రవేశ పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 18న జరుగనున్న తెలంగాణ రాష్ట్ర బంద్ కు జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షాన సంఘీభావం తెలుపుతున్నామన్నారు. రిజర్వేషన్ పెంపును వ్యతిరేకిస్తూ కొంతమంది నాయకులు కోర్టుల్లో పిటిషన్లు వేయడం ద్వారా బీసీ వర్గాల హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలను కేవలం 5 శాతం కంటే తక్కువ ఉన్న వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా అణగదొక్కాలనే ఉద్దేశం దురదృష్టకరం, బాధాకరం అన్నారు. బంద్ రోజు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగులు విజయ్ చందర్, సాయిబాబా, కొండ శంకర్, నిరంజన్ పాల్గొన్నారు.