– అంబేద్కర్ యువజన సంఘం నాయకులు
– మునుగోడులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
మునుగోడు, నవంబర్ 26 : భారతదేశంలో ఎలాంటి వివక్షతకు తావులేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమే అని మునుగోడు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులు, జాతులు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి అనేక అసమానతలు రూపు మాపడానికి కృషి చేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనా భారతదేశంలో మన రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
అందరిని సమానంగా చూడాలి, సమాన అవకాశాలివ్వాలి, ఎవరికయినా ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి అధికారం పొందవచ్చన్నారు. రాజ్యాంగ ఫలాలు ప్రతి భారతీయుడికి అందిననాడే డాక్టర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, గోలి రామదాసు, రెడ్డిమల్ల యాదగిరి, పెరుమాల్ల ప్రతాప్, బొల్లు సైదులు, నీరుడు సైదులు, బసనగర ముత్యాలు, గంగుల కృష్ణయ్య, గోలి శ్రీనివాస్, ముచ్చపోతుల శ్రావణ్, దుర్గాప్రసాద్, బసనగర రాము, అద్దంకి అంజయ్య, ముచ్చపోతుల పవన్ పాల్గొన్నారు.