ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 17 : సవరణలు, సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని పీవైఎల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య అన్నారు. బుధవారం ఆత్మకూర్.ఎస్ మండలంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. భారతదేశంలో అనేక సంవత్సరాలుగా వ్యవసాయ కూలీలు పోరాడి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పులు, చేర్పుల పేరుతో కేంద్రం నిర్వీర్యం చేసే దుర్మార్గానికి పూనుకుంటుందని దుయ్యబట్టారు. క్రమంగా బడ్జెట్లో కూడా ఈ పథకానికి నిధులు తగ్గిస్తూ వస్తుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉపాధి హామీ పనులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చేది కానీ నేడు 60 శాతానికి కుదించి, మిగతా 40 శాతం రాష్ట్రాలు భరించే విధంగా ప్లాన్ వేసి రాష్ట్రాలను కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుందన్నారు. పేరుకి 125 రోజులు పని దినాలు పెంచుతూ బడ్జెట్లో మాత్రం కోతలు విధిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు పేరున పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలని, లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.