చిట్యాల, ఫిబ్రవరి 11 : రేవంత్ ప్రభుత్వం కుల గణన పేరుతో తప్పుడు సర్వే చేయించి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండలంలోని గుండ్రాంపల్లిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను రద్దు చేసి, మళ్లీ సర్వే చేయించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలే గట్టిగా సమాధానం చెబుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణ పాఠం చెప్పడానికి ఎదురుచూస్తున్నారని తెలిపారు. కొడంగల్ నుంచే రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో నిన్న జరిగిన రైతు మహాధర్నానే నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేసిందని, కానీ సంక్షేమ పథకాల్లో పెడుతున్న కోతలను చూసి విసుగెత్తిన ప్రజలు రేవంత్ సర్కారుకు కోతలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దరఖాస్తుల పేరిట 14 నెలల కాలయాపన చేశారని, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలను, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీలే గాక ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మోసపోయారని పేర్కొన్నారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుతున్నదే తప్ప వారికి చేసిన మేలు ఏమీ లేదని విమర్శించారు. సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల నర్సింహ, మాజీ ఎంపీటీసీ కోయగూర నర్సింహ, కొలను వెంకటేశ్, జలంధర్‌రెడ్డి, కొలను సతీశ్ తదితరులు పాల్గొన్నారు.