నిడమనూరు, జూన్ 17 : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల చేతిలో గుణపాఠం తప్పదని నాగార్జునసాగర్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లి రాజు యాదవ్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు బీసీల ఓట్లు రాబట్టేందుకు ప్రకటన చేసిన కాంగ్రెస్ ఎన్నికల తర్వాత నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తుందని ఆరోపించారు.
జీఓ ల పేరుతో బీసీలను మభ్యపెట్టే యత్నాలను మానుకోవాలన్నారు. జీఓ లతో బీసీలకు ఎంత మాత్రం ప్రయోజనం చేకూరదని, మెజారిటీ కులాలైన యాదవ, మున్నూరుకాపులకు మంత్రి వర్గ కూర్పులో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో బీసీ జన గణన చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు అమలు చేసి నిబద్ధత చాటుకోవాలని పేర్కొన్నారు.