తిరుమలగిరి(సాగర్), మార్చి 24 : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలంలోని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నేనావత్ అశోక్‌నాయక్, రమావత్ జలంధర్ ఎమ్మెల్సీ సమక్షంలో సోమవారం బోయగూడెం గ్రామంలోని తన నివాసంలో బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, సీజన్‌కు ఎకరాకు రూ.7.500 రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతులు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని, సమయానికి రైతుబంధు అందించి, రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.
ప్రభుత్వానికి సాగునీరు సక్రమంగా వినియోగించుకునే తెలివి లేక వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30వేల నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వీర్లగడ్డ మాజీ సర్పంచ్ సంధ్య, రాములునాయక్, దేశ్యాబాలు, పేరూరు ఆలయ మాజీ చైర్మన్ మనాది పురుషోత్తం, రమావత్ చంద్రమౌళి, జటావత్ రమేశ్, రమావత్ బీమా ఉన్నారు.