భువనగిరి అర్బన్, జూన్ 13: చెక్ బౌన్స్ కేసులో పరారైన నిందితుడి కోసం పట్టణ పోలీసులు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మహ్మద్ అతహర్పై భువనగిరి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు విచారణలో ఉన్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అతహర్ కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదు.
న్యాయస్థానం అతడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో గురువారం రీకాల్ పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు పిటిషన్‌ను కొట్టి వేస్తూ నిందితున్ని కస్టడీకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ సమయంలో కోర్టు ఆవరణలో ఉన్న అతహర్ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి పట్టణ పోలీసులను ఆదేశించారు.