సూర్యాపేట, ఆగస్టు 3 : ఏపీ ప్రభుత్వం గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును అక్రమంగా కడుతూ తెలంగాణకు రావాల్సిన నీటిని దోచుకుపోయేందుకు కుట్రలు పన్నుతోందని దీన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను ఎడారిగా మార్చే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారని, ఆలస్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మేమున్నాంటూ కపటనాటకం ఆడుతోందని బనకచర్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మొదటి నుంచీ బనకచర్లను అడుగడుగునా అడ్డుకుంటోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు 900ల టీఎంసీలు, ఆంధ్రాకు 500ల టీఎంసీల గోదావరి జలాలను కేటాయించగా దాని ప్రకారం మన వాటా మనం పూర్తిగా వాడడం లేదన్నారు.
ఇప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు మిగులు జలాలను వాడుకుంటే తప్పేముందంటూ బనకచర్లను కట్టి తీరుతామని చెబుతున్నారని అన్నారు. ఈ విషయమై సీడబ్ల్యుసీ, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశామని, బనకచర్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ఖచ్చితంగా అడ్డుకుంటుందన్నారు. బనకచర్ల వస్తే ఉమ్మడి నల్లగొండ, మహబుబ్‌నగర్ ప్రాంతాలతో పాటు సూర్యాపేట జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు ఏడారిగా మారతాయన్నారు. గతంలో కృష్ణా జలాల విషయంలోనూ ఇలాగే దోచుకున్నారని ఇప్పుడు గోదావరి జలాలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. గోదావరి, కృష్ణా జలాలను కాపాడుతూ ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రెండు పిల్లర్లు కూలితే బాగు చేయించి నడిపిస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని దాన్ని పడావు పెట్టారన్నారు. పొలవరం మూడుసార్లు కూలిందని, కేంద్రమే నిధులుచ్చి మరమ్మతులు చేయించిందనే విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి లేదని కేసీఆర్ ఏది చేసినా రైతుల కోసమే చేశారని కడిగిన ముత్యంలా కేసీఆర్ ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నారని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.