యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై కాంగ్రెస్ సర్కారు వివక్ష చూపుతున్నది. దేశ, విదేశాలను ఆకర్షిస్తున్న నారసింహుడి క్షేత్రంపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రపంచమే నివ్వెరపోయేలా కేసీఆర్ అత్యద్భుతంగా పునర్నిర్మించిన ఆలయంపై చిన్నచూపు చూస్తున్నది. తొలి సీఎం కేసీఆర్‌కు పేరొస్తుందని దేవస్థానానికి నిధులు కొరత సృష్టిస్తున్నది. రెండున్నరేండ్లలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా తమ చిత్తశుద్ధిని బయటపెట్టుకున్నది. ఫలితంగా గత ప్రభుత్వంలోని పనులు, ప్రాజెక్టులు పెండింగ్‌లో మూలుగుతుండటంతో అభివృద్ధి గాడి తప్పింది. ఆలయంలో భక్తులను సమస్యలు వెంటాడుతున్నాయి. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకూ అతీగతిలేదు. నిధులు లేకపోవడంతో వైటీడీఏ సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చే పనిలో అధికారులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
యాదగిరిగుట్ట ఆలయాన్ని నిత్యం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు దర్శిస్తున్నారు. శనివారం, ఆదివారం, సెలవు దినాల్లో ఆలయం మరింత కిక్కిరిస్తున్నది. ఆదాయం సైతం భారీగా సమకూరుతున్నది. పండుగలు, సెలవు దినాల్లో రూ.కోటికి చేరుకుంటున్నది. కాంగ్రెస్ సర్కారు మాత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి అభివృద్ధిని గాలికొదిలేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా చిల్లిగివ్వ కూడా ఇవ్వలేదంటే యాదగిరి నర్సన్నపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వివక్షకు తార్కాణంగా చెప్పొచ్చు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో రూ.100 నుంచి రూ.200 కోట్లు కేటాయించేది. హస్తం సర్కారు మాత్రం ఒక్కసారి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించకపోగా కనీసం ప్రస్తావన తీసుకురాలేదు. పాత పనులకే కొత్తగా శంకుస్థాపనలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. 2023 జూన్ 21 వేద పాఠశాలతో పాటు ఇతర పనులకు అప్పటి బీఆర్ఎస్ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసినవే కావడం గమనార్హం. అదే వేద పాఠశాలకు ఇటీవల మళ్లీ హంగూ ఆర్భాటాలతో రేవంత్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఇప్పటికే పూర్తయిన పనులకు రూ.130 కోట్ల బకాయిలు పెండింగ్‌లో మూలుగుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పలు పనులు చివర దశలో ఉన్నాయి. కొద్ది మేర నిధులు విడుదల చేస్తే బ్రహ్మాండంగా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైన కొండపైకి వెళ్లే లండన్ నెట్వర్క్ బ్రిడ్జి రెండున్నరేండ్లు దాటినా ఇంకా పూర్తి కాలేదు. కొండకింద బస్టాండ్, కల్యాణకట్ట, సెంట్రల్ పార్కింగ్, నిత్యాన్నదాన సత్రం ప్రాంతాల్లో 139 దుకాణాలు నిర్మించారు. 59 మందికి ప్రొసీడింగ్‌లు అందజేయగా వినియోగంలోకి వచ్చాయి. మిగతా వాటిలో వసతులు కల్పించాల్సి ఉండగా కనీసం పట్టించుకోవడం లేదు. కొండ కింద బస్టాండ్ పక్కనే గుట్టపైకి వెళ్లేందుకు దేవస్థాన బస్సు ప్రాంగణ నిర్మాణం చివరి దశలో ఉంది. ఇది పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్న సోయి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. కాళేశ్వరం జలాలతో కొండ కింద గండి చెరువును నింపిన అప్పటి ప్రభుత్వం స్వామి వారి తెప్పోత్సవం నిర్వాహించాలని ప్రతిపాదించింది.
ఇందుకోసం వైటీడీఏ నిధుల కింద రూ.93.70 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు తరహాలో మ్యూజికల్ వాటర్ ఫౌంటేన్, ఆర్నమెంటల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక అన్నీ పెండింగ్‌లో పెట్టారు. రాయగిరి వరకు సౌండ్ సిస్టంతో కూడిన కెమెరాలు, ఇజ్రాయెల్‌కు చెందిన విద్యుద్దీపాల ప్రతిపాదన పక్కన పడేశారు. గుట్ట కింద నుంచే కొండపైకి వెళ్లడానికి ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి దేవస్థానానికి అందించి.. భక్తులకు ఉచిత సేవలు అందించాలనే లక్ష్యం నీరుగారుతోంది. టెంపుల్ సిటీపై విల్లాలు, కాటేజీల నిర్మాణం చడీచప్పుడు లేదు. కొండపై మరుగుదొడ్లు, రక్షిత తాగునీరు లాంటి మౌలిక వసతులు మెరుగుపర్చాల్సి ఉంది. సదుపాయాలు లేక క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు దేవుడెరుగు.. స్వయంగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకూ దిక్కూదివాణా లేదు. గతేడాది రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆలయాన్ని రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆయన ఇచ్చిన హామీ ఇప్పటి దాకా పత్తాలేకుండా పోయింది. సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారు. గోశాల పాలసీ తేవాలని, టూరిజం సర్యూట్ అభివృద్ధి చేయాలని, కొండపై గెస్ట్‌హౌస్‌లు కట్టడానికి దశలవారీగా చర్యలు తీసుకోవాలని, భూకేటాయింపులకు టీటీడీ మోడల్లో పాలసీ రూపొందించాలని ఆదేశించినా ఆచరణ సాధ్యం కావడం లేదు. నాలుగుసార్లు వచ్చినా ప్రతిసారి ఉత్తి చేతులతో వచ్చిపోవడం తప్ప ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. పైసా ఖర్చు లేకుండా పాలక మండలి బోర్డు ఏర్పాటు చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీలేదు.
యాదగిరిగుట్ట ఆలయం నిధులు లేక ఎంత దీన స్థితిలో ఉందని చెప్పడానికి మరో ఉదాహరణ వైటీడీఏ భూసేకరణ. గత ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధి కోసం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా దేవస్థాన పరిధిని విస్తరించింది. యాదగిరిగుట్టతో పాటు యాదగిరిపల్లి, గుండ్లపల్లి, సైదాపురం, మైలారిగూడెం, మల్లాపురం గ్రామాల్లో భూసేకరణ చేపట్టారు. సుమారు 1,240 ఎకరాలను సేకరించారు. ఇందులో 560 ఎకరాలు ప్రభుత్వ పరిధిలోని వివిధ కేటగిరీల నుంచి తీసుకున్నారు. 680 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఈ రైతుల్లో కొంత మందికి దాదాపు రూ.20 కోట్ల వరకు భూసేకరణ డబ్బులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం లేదు. దేవస్థానానికి ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉండటంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో రైతులకు వారివారి భూములను తిరిగే ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే వారికి అప్పగించనున్నట్లు సమాచారం.
వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో యాదగిరిగుట్ట దివ్య క్షేత్రాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. భారత దేశ చరిత్రలో తొలిసారిగా రూ.1,200 కోట్లతో పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతి పెద్ద దేవాలయంగా యాదగిరిగుట్ట నిలిచింది. కొండపై 17.32 ఎకరాల్లో ప్రధానాలాయన్ని విస్తరించారు. ఇందులో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాడవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల గోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిఫ్ట్‌లు, ఆకర్షణీయమైన క్యూలైన్లు, ప్రసాదాల తయారీ కేంద్రం నిర్మించారు.
దీంతో ఒక్కసారి ఆలయం దేశ, విదేశాలను ఆకర్షించింది. ఈ క్రమంలోనే అప్పటి సీఎం కేసీఆర్ పేరు మోర్మోగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటూ ఆయన కృషిని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కారు యాదగిరిగుట్టకు నిధులు ఇవ్వడంలేదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే యాదగిరిగుట్ట అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే యాదగిరిగుట్ట అన్న చందంగా మారిన నేపథ్యంలో తాము ఏం చేసినా ఆయన ఖాతాలో పడుతుందనే భ్రమలో హస్తం ప్రభుత్వం ఉందని అంతటా చర్చించుకుంటుండటం విశేషం.