Lingamanthula Jathara | సూర్యాపేట, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రెండో అతిపెద్ద జాతర.. రెండేండ్లకోసారి జరిగే దురాజ్‌పల్లి లింగమంతుల జాతరపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. నిండా రెండు వారాల గడువే ఉండగా.. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికీ నయా పైసా విదిల్చలేదు. 2014కు పూర్వం గత ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు అప్పటి సమైక్య పాలకులు రూ.50వేలకు మించి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. స్వరాష్ట్ర సాధన అనంతరం సూర్యాపేట ఎమ్మెల్యేగా జగదీశ్‌రెడ్డి వరుస విజయాలతో పెద్దగట్టుకు కొత్త వైభవం చేకూరింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఐదు జాతరలకు దాదాపు రూ.15 కోట్లకుపైనే ఖర్చు చేయడంతో పెద్దగట్టు రూపురేఖలు మారాయి. రాష్ట్ర నలుమూలలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు లక్షల్లో పోటెత్తినా ఎక్కడా అసౌకర్యం అనే మాట వినిపించ లేదు. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వసతుల కల్పనపై కనీస శ్రద్ధ పెట్టడం లేదు. ఫిబ్రవరి 16 నుంచి జాతర ప్రారంభం కాకుండా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంపై యాదవులతోపాటు అన్ని వర్గాల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగట్టు జాతరపై మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని నిర్లక్ష్యపు నీడలు అలుముకుంటున్నాయని ఆందోళన చెందుతున్నారు.
పెద్దగట్టు లింగమంతుల జాతర బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం వైభవంగా వెలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ నానా అవస్థలు పడి లింగన్న దర్శనం చేసుకొని వెళ్లేవారు. నాటి ప్రభుత్వాలు జాతరను కనీసం గుర్తించకపోవడం, స్థానిక పాలకులు పట్టించుకోకపోవడంతో నిధులు రావడం మహాగగనంగా ఉండేది.
వచ్చిన నిధులతోనూ తాత్కాలిక పనులు చేపట్టి మెజారిటీ స్వాహా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో అనాదిగా జరిగిన జాతరలన్నింటికీ కలిపి కూడా 2014 తరువాత జరిగిన ఒక్క జాతరకు బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసినన్ని నిధులు ఇవ్వలేదని పలువురు యాదవ పెద్దలు చెబుతున్నారు. కేసీఆర్ సర్కారులో మాత్రం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి చొరవతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక శాశ్వత సౌకర్యాలు కల్పించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదు సార్లు జాతర రాగా.. ప్రతి జాతరకూ కోట్లాది రూపాయలు విడుదలయ్యాయి. 2015 ఫిబ్రవరిలో మొదటి జాతర రాగా, ఘనంగా జరిపేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి సీఎం స్పెషల్ డెవల్మెంట్ ఫండ్ నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.2.10కోట్లు తీసుకువచ్చారు. 2017 జాతరకు రూ.1.29 కోట్లు, 2019లో రూ.1.75కోట్లు, 2021లో రూ.2కోట్లు, 2023లో జరిగిన జాతరకు రూ.5కోట్లు మంజూరు చేయించారు. మొత్తం ఐదు జాతరలకు కలిపి ప్రభుత్వం రూ.12.14 కోట్లు ఇవ్వగా, కానుకలు, వేలం పాటల ద్వారా మరో రూ.3కోట్ల వరకు వచ్చాయి.
ఆ నిధులతో లింగమంతుల జాతరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ లేనివిధంగా శాశ్వత సౌకర్యాలు కల్పించారు. పాత గుడి స్థానంలో నూతన నిర్మాణం చేపట్టారు. గుట్టపై వరకు ప్రత్యేకంగా మిషన్ భగీరథ పైపులు వేసి లక్ష లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకును నిర్మించారు. శాశ్వత కల్యాణ కట్ట, ఈఓ కార్యాలయం, భారీ గెస్ట్ హౌస్ కట్టారు. భక్తుల సౌకర్యం కోసం గుట్ట చుట్టూ నీటి సంపులు, నల్లాలు ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీటిని అందించారు. ప్రత్యేకంగా సబ్‌స్టేషన్, శాశ్వత విద్యుత్ లైన్లు, గుట్ట వద్దకు వెళ్లేందుకు ఉన్న రెండు రహదారులను సీసీలుగా మార్చడం జరిగింది. అన్నింటికీ మించి గుట్టకు అనుకుని ఉన్న పాత కోనేరును అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
ఫిబ్రవరి రెండున పెద్దగట్టు స్వామి జాతరకు సంబంధించి దిష్టిపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు జాతర సాగనుంది. నిండా రెండు వారాలే గడువు ఉండగా, నిధుల లేమికారణంగా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. గత బీఆర్ఎస్ హయాం లో ప్రతి జాతరకు మూడు నెలల ముందు నుంచే అభివృద్ధి, మౌలిక వసతుల పనులు ప్రారంభమయ్యేవి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు, మరో ఇన్చార్జి మంత్రి ఉండగా.. కనీసం బీఆర్ఎస్ హ యాంలో చేపట్టిన పనులను మెయింటెనెన్స్ కోసమైనా నిధులు ఇచ్చేనా అని పలువురు యాదవ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.