నార్కట్పల్లి, నవంబర్ 4 : రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తెచ్చి నెల రోజులైనా కొనుగోలు చేయరా.. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సోమవారం మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి అనంతరం విలేకరులతో మాట్లాడారు. మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మళ్లీ వాటివైపు అధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగి చూడలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేయలేదని, అధికారులతో సంబంధిత సమావేశాలు ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లకు క్వింటాకు రూ. 500 బోనన్ చెల్లించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరికోతలు ప్రారంభమై నెల గడుస్తున్నా కొన్ని చోట్ల గన్నీ బ్యాగులు కూడా లేవని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్దకు సరైన సమయానికి లారీలు కూడా రావడం లేదని, అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అకాల వర్షాలతో రైతులు కంటికి నిద్ర లేకుండా కేంద్రాల వద్ద పడిగాపులుకాస్తున్నారని అన్నారు. చిన్న, పెద్ద కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని, మాటలు మితిమీరవద్దని హెచ్చరించారు. రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, చిరుమర్తి యాదయ్య, కర్నాటి ఉపేందర్, మహేశ్వరం సతీశ్, శ్రీను, దోసపాటి విష్ణుమూర్తి, పర్రెపాటి యాదగిరి, వాజిద్, పకీర్ సత్తిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.