– కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున
– నల్లగొండలోని సుభాస్ సెంటర్లో బడ్జెట్ పత్రులు దహనం
రామగిరి, మార్చి 21 : దళితుల సంక్షేమాన్ని నీరుగార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉందని పేర్కొంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద శనివారం బడ్జెట్ పత్రులను దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ద్వారా అభివృద్ధి పథం చూపిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ హామీలను పూర్తిగా విస్మరించించి దళితులను మోసం చేసిందన్నారు. గత బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.11,784 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. దీంతో బడ్జెట్లో ఎస్సీ వర్గానికి సుమారు 70 శాతం కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధి పేరుతో మాటలు మాత్రమే చెప్పి, ఆచరణలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దళిత బందును ప్రస్తుత ప్రభుత్వం మరిచిందన్నారు.
అదే విధంగా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పటికీ బడ్జెట్లో ఒక్కరూపాయి కూడా కేటాయించలేదన్నారు. దళితుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దీంతో స్పష్టమవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే బడ్జెట్ సవరణ చేసి ఎస్సీ వర్గానికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అందోనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ, మండల కార్యదర్శి బొల్లు రవీందర్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంపాటి శంకర్, ఎంబిఎన్ ట్రస్ట్ కన్వీనర్ పుచ్చకాయల నర్సిరెడ్డి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేశ్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్, అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పాల్గొన్నారు.